రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
posted on Nov 28, 2025 8:18AM

రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం ఎంపీలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అత్యధిక యువ పార్లమెంటేరియన్లు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారన్న ఆయన ఆ యువశక్తిని ఉపయోగించి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం (నవంబర్ 27) జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మార్గదర్శనం చేశారు. మొంథా తుఫాన్ నష్టపరిహారం, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వంటి అంశాలపై కేంద్రాన్ని ఒప్పించేలా సభలో ఎంపీలు కృషి చేయాలన్నారు. 2027 జూన్‌లో పోలవరాన్ని జాతికి అంకితం చేయడమే లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమన్నారు.
వంశధార-గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ-విజయవాడ మెట్రో రైలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను సభలో లేవనెత్తాలన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించాలని సూచించారు.