సీఎంను వెనకేసుకొచ్చిన సర్వే

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణ వెనకేసుకొచ్చారు. తెలంగాణపై ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. సకల జనుల సమ్మె కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తెలంగాణను ఆంధ్రా ప్రాంతంలో కలిపేటప్పుడే విడిపోవచ్చునని సూచించారన్నారు.  ఇందిరాగాంధీ కూడా తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకం అయితే చెన్నారెడ్డి వంటి నేత ఎలా వచ్చే వారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నిన్న మొన్న పుట్టిన పార్టీ అని జై తెలంగాణ నినాదం పుట్టిందే కాంగ్రెసు నుండి అన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో తాను ఏమీ చేయలేని అంశం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే ఆమె రాష్ట్రాన్ని మూడు కాదు నాలుగుగా చేయాలని అంటున్నారని విమర్శించారు.కాంగ్రెసు పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు అధికార పార్టీ నేతలు ఎవరూ లొంగవద్దన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu