భార‌త్ బ‌యోటెక్‌కు సీఐఎస్ఎఫ్ క‌మెండోలు.. ఎందుకో తెలుసా?

భార‌త్ బ‌యోటెక్‌. ఇదిప్పుడు జ‌స్ట్ కంపెనీ కాదు. దేశానికి సంజీవ‌ని. వ్యాక్సిన్లు త‌యారు చేసే గ‌ని. కోట్ల సంఖ్య‌లో కోవాగ్జిన్ టీకాల ఉత్ప‌త్తి కేంద్రం. భార‌త్ మేడ్ వ్యాక్సిన్ ఇదొక్క‌టే. మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన‌ భారతీయ టీకా. భార‌త్ బ‌యోటెక్ ఎంత సుర‌క్షితంగా ఉంటే.. భార‌తదేశం అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే, ఈ టీకాల కంపెనీపై ఉగ్ర‌వాదుల క‌న్ను ప‌డే అవ‌కాశం ఉందంటూ నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. అంతే. క్ష‌ణం ఆలోచించ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వెంట‌నే భార‌త్ బ‌యోటెక్‌కు కేంద్ర భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో సెక్యూరిటీ క‌ల్పించాల‌ని ఆదేశించింది. 

హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట జినోమ్‌వ్యాలీలో ఉన్న కంపెనీ ప్రాంగణానికి 64 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమెండోలతో రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి కమెండోలు పరిశ్రమకు రక్షణగా ఉంటూ పహారా కాస్తారని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనిల్ పాండే తెలిపారు.

2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు సంస్థలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది. పూణె, మైసూరులోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్‌లోని రాందేవ్ బాబా పతంజలి సహా దేశవ్యాప్తంగా పది కంపెనీల‌కు సీఐఎస్ఎఫ్ భద్రత ఉంది. తాజాగా, కోవాగ్జిన్ ఉత్ప‌త్తి కేంద్ర‌మైన‌ భారత్ బయోటెక్‌కు సైతం సీఐఎస్ఎఫ్ కమెండోలతో భద్రత కల్పించనుంది కేంద్రం. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu