రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరు
posted on Jun 17, 2025 6:19PM

చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం ముగిసింది. తిరుమలకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయిస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమల్లోకి రాబోతోందని, త్వరలోనే టీటీడీకి ఆ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నట్టు తెలిపారు. తిరుమలలో CSIR పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేయనుందని.. ఈ ల్యాబ్ లో నెయ్యి, నీరు, పప్పు ధాన్యాల నాణ్యతను పరిశీలించవచ్చని వెల్లడించారు.
టీటీడీకి చెందిన 7 స్కూళ్లలో 1600 మంది విద్యార్థులకు హ్యూమానిటీ, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామన్నారు. అదే విధంగా బెంగుళూరులో మరో పెద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలని ఆ రాష్ట్రం కోరిందని, వారి వినతి మేరకు మరో విశాలమైన ఆలయం నిర్మిస్తామని తెలిపారు. సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.