ఆ చిరు కానుకపై విమర్శల వెల్లువ
posted on Jun 20, 2012 10:46AM
తాను ప్రాతినిథ్యం వహించిన తిరుపతి అసెంబ్లీని సోనియాగాంధీకి కానుకగా ఇస్తానని ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆ ఒక్క హామీ వల్లే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులూ, మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులూ పోటాపోటీగా విమర్శలు చేస్తున్నారు. అసలు తన గెలుపుకు కారణమైన పి.ఆర్.పి. శ్రేణులను వదిలేసిన చిరంజీవి అసలు ఎన్నికల్లో విజయం సాధించగలనని ఎలా అంచనా వేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని విమర్శకులు అంటున్నారు. మరి ఓటమి తరువాత సోనియాకు ఏమి కానుక ఇచ్చారో బహిరంగపరచాలని డిమాండు చేస్తున్నారు. పోనీ, భవిష్యత్తులోనైనా ఏమి కానుక ఇవ్వగలరో వెల్లడించాలని కోరుతున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ అప్పారెడ్డి అయితే అసలు చిరునే తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. సోనియాకు కానుక ఇస్తానని చిరంజీవి చేసిన ప్రకటనకు ఎన్నికల ఫలితాలను చూశాక నోటిమాటే పడిపోయి ఉండవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.