తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనట

 

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనని చిరంజీవి మరొకమారు తేల్చి చెప్పారు. తామిదరం వేర్వేరు పార్టీలలో ఉన్నందున ఎవరి ప్రచారం వారిదేనని, ఇద్దరూ సోదరులే అయినప్పటికీ, రాజకీయంగా మాత్రం ప్రత్యర్దులమేనని అన్నారు.

 

ఈరోజు తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఒక జీవనది వంటిది. దానిని ప్రవహించకుండా అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు.కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తామని గతంలో చాలామంది బయలుదేరారు, కానీ చివరికి వారే కనబడకుండా పోయారు. రాష్ట్ర విభజనకు కేవలం కాంగ్రెస్ పార్టీనే నిందించడం తగదు. అన్ని పార్టీల అంగీకరించిన తరువాతనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో వ్యతిరేఖత ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం తప్పని ప్రజలే నిరూపించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతోంది. దానిని ప్రతిపక్షాలే స్వయంగా చూడబోతున్నాయి."

 

"చంద్రబాబుకి ఈ ఎన్నికలు ఆఖరిపోరాటం వంటివి. ఈ ఎన్నికల తరువాత ఆయన మరిక కనబడక పోవచ్చును. అదేవిధంగా ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి తన కేసుల నుండి బయటపడేందుకు చేస్తున్న రక్షణ పోరాటం వంటివి. ఆయన చెపుతున్న సంక్షేమ కబుర్లు, చేస్తున్న వాగ్దానాలు అన్నీ అబ్బదం. ఆయన అధికారంలోకి వచ్చి తన కేసుల నుండి బయటపడాలని తాపత్రయ పడుతున్నారు. నరేంద్ర మోడీ హిట్లర్ అని నేనన్న మాటకి కట్టుబడిఉన్నాను. ఆయనకు మహిళలలంటే ఎంత చులకన భావమో అయన ప్రియాంకా గాంధీని ఉద్దేశించి అన్న మాటలు వింటే అర్ధమవుతుంది. ఆయన మాటలను కనీసం బీజేపీ మహిళా నేతలు కూడా సమర్ధించరని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.