ఒంగోలు గడ్డపై చిరంజీవి ఫ్లాప్ షో

 

‘కాశీకి వెళ్లానని..కాషాయం’ అంటూ ఇంద్ర సినిమా డైలాగుతో ప్రారంభమైన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది.నూనూగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దలనే అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతన లేకుండా చేసిన వ్యాఖ్యలివి.

 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇతర కాంగ్రెస్ పెద్దలతో కలిసి తాను చేపట్టిన కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినట్లుంది అంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పట్టింది. గుంటూరు జిల్లా నుంచి ఒంగోలులోకి ప్రవేశించిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆద్యంతం పెద్ద జోకులాగే సాగింది.

 

ఇక సభలో కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంబోధించినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. ఇక చిరంజీవి కూడా గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు.