జంప్‌కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్..

కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన కెపి వివేకానందకు హైకోర్టులో చుక్కెదురైంది. నిబంధనలకు విరుద్దంగా ఆయన నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చింతల్ హైదర్‌గూడ ప్రాంతంలోని సర్వే నం. 208, 209, 211, 212లలో గల స్థలంలోని భవనాల నిర్మాణానికి చట్టాన్ని అతిక్రమించారని స్వయానా ఎమ్మెల్యే పినతండ్రి కె.ఎం ప్రతాప్ గత సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణానుమతులు తీసుకోకపోగా సెట్‌బ్యాక్, పార్కింగ్ ఏరియా నిబంధనలనూ పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు.

 

దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఆ భవనాలను జూన్ 1కల్లా కూల్చి వేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు వెలువరించింది. ఈ భవనంలో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలను జూన్ ఖాళీ చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్దంగా ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు అక్రమ నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. అయితే కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే వివేకా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆక్రమణదారులపై కరుణ చూపరాదని..అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాల్సిందేనని వ్యాఖ్యానించింది. చట్టాలు తెలిసిన, చట్టాలు చేసే ఎమ్మెల్యేనే ఇలా చేస్తే సామాన్యుల సంగతేంటని నిలదీసింది. హోదాను అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలనుకోవడం సమంజసం కాదని హైకోర్టు తూర్పారబట్టింది. భవనాన్ని కూల్చివేయాలని పాత తీర్పునే వెలువరించింది.