హాట్‌టాపిక్‌గా మారిన చెవిరెడ్డి కన్నీటి ఎపిసోడ్!

వైసీపీలో కీలక నేతగా వెలుగొందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం తెగ దూకుడు ప్రదర్శించారు.  అలాంటి ఫైర్‌బ్రాండ్ కనీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తన స్వగ్రామం తుమ్మలగుంట అత్మీయసభలో మీకు అన్ని చేశాను, కాని మీరు నా కొడుకును ఓడించారంటూ తన మనోవేదన  వెళ్లగక్కిన సందర్భంలో ఆయన కళ్లు చెమర్చాయి. గత 11 నెలలుగా గ్రామస్తులలో ఎలాంటి సమావేశాలు పెట్టని అయన తాజాగా ఉన్నట్లుండి మీటింగ్ పెట్టారు. అసలు చెవిరెడ్డి ఎందుకు అంత అత్యవసరంగా అత్మీయ సమావేశం ఏర్పాటు చేశారనేది చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో వైసిపి కీలక నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంటే తెలియని వారుండరు. జగన్ ప్రభుత్వంలో తుడా చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన మంత్రి పదవి దక్కించుకోలేక పోయినప్పటికీ.. చాలా మంది మంత్రుల కంటే ఎక్కువగానే చెలాయించారు.  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి ఏకంగా తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్‌లో తిరుమల దేవాలయ సెట్ వేయించి తన నాయకుడితో ఉగాది వేడుకలు నిర్వహింప చేసి తన వీరవిధేయత చాటుకుని  విమర్శల పాలయ్యారు.

2014లో టీడీపీలోని అనైక్యతతో చంద్రగిరిలో సొంత సామాజికవర్గం గల్లా అరుణకూమారిని వ్యతిరేకించడంతో చెవిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2019లో జగన్ గాలిలో సునాయాస విజయం సాధించారు. అయితే మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగా పండుగలకు తాయిలాలు పంచడంతో పాటు ఇంటింటికి శుభాకాంక్షలు వెళ్ళేవి. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ రాక ముందే తానే నియోజకవర్గంలో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మంత్రాంగం సాగించారు. అలా అన్నీ కలిసి వచ్చి 2019లోఆయన భారీ మెజార్టీతో గెలవగలిగారు.

ఎన్నికల తర్వాత శాసన సభ విప్‌తో పాటు తుడా చైర్మన్ పదవి కూడా అయనకే దక్కింది.  తుడా పదవిని అడ్డంపెట్టుకుని చెవిరెడ్డి పెద్ద తతంగమే నడిపారు. తన గ్రామ సమీపంలోని తుమ్మలగుంట చెరువును సగానికిపైగా పూడ్పించి.. తుడా నుంచి 60 కోట్లు పైగా ఖర్చు పెట్టి అత్యాధునిక వాకింగ్ ట్రాక్‌తో పాటు, అనేక విధాలుగా అభివృద్ది చేసారు. చెరువును పూడుస్తున్నా చెవిరెడ్డి హవా చూస్తూ ఇరిగేషన్ శాఖ వారు నోరెత్తలేకపోయారంటారు. 

తుడా పరిధిలో ఇష్టా రాజ్యంగా బెంచీల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి,  ఆ బల్లలపై తన పేరు వేయించుకుని చెవిరెడ్డి చేసిన ప్రచార అర్భాటం ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. దానికి తోడు రహాదారులకు సైతం వైఎస్‌తో పాటు తన పేరు పెట్టుకున్న ఘనత ఆయనది. తుడా అనేది కేవలం చంద్రగిరి నియోజకవర్గం వరకే అన్నట్లు పాలన సాగించారు. తుడా నిధులతో సొంత సర్వే టీములకు, వ్యక్తిగత సిబ్బందికి జీతాలు ఇప్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. వాటితో పాటు అనేక రకాలుగా తుడా నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగాలున్నాయి.

తుడా నిధులతో  తుమ్మల గుంట చెరువులో ఏర్పాటు చేసిన పార్కుపై ఇప్పటికీ వివాదాలు నడు స్తున్నాయి.  పూర్వం చెరువు ఏలాగుందో అలా ఉంచాలని చాలామంది గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ అదేశాలతో అవిలాల చెరువును యాధావిధిగా ఉంచడానికి టీటీడీ ఇరిగేషన్ శాఖ అందులో ఉన్న నిర్మాణాలు తొలగిస్తోంది. ఇదే పరిస్థితి తుమ్మల గుంట చెరువులో ఏర్పాటు చేసిన పార్క్‌కు కూడా పట్టే కాలం దగ్గరలో ఉందని అంటున్నారు.

ఎన్నికలలో ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చెవిరెడ్డి. మరో వైపు చంద్రగిరిలో తన కూమారుడు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా రంగంలో దించారు. మోహిత్ భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పలు కేసులు, వివాదాలు చెవిరెడ్డిని చుట్టుముడుతున్నాయి. ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదుతో సీఐడీ కేసులు పెట్టి విచారిస్తోంది. తుడా నిధల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్నది. దాంతో పాటు పోలింగ్ తర్వాత పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటిలో జరిగిన దాడికి సంబంధించి హత్యాయత్నం కేసుల విచారణ సాగుతోంది.

వాటితో పాటు తుమ్మలగుంట చెరువులో ఉన్న పార్క్‌ను ఇప్పటి వరకు చెవిరెడ్డి తన సొంత ఆస్తిలా భావిస్తూ వచ్చారు.. ఇప్పుడు దాన్ని తుడా నిర్వహణలో తీసుకోవాలని పై స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పావులు కదపడం మొదలు పెట్టారంట. గ్రామంలోని వారందరితో అత్యవసర అత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను అందర్నీ బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నా, తన బిడ్డని ఓడించారంటూ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారంట. దాంతో పాటు పార్క్‌ను తుడా నిర్వహిస్తే దారుణంగా మారిపోతుందని దాని కోసం పోరాటం సాగిద్దామని పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా మారింది. 

పార్క్ కట్టిన చెరువు ఇరిగేషన్ శాఖది, అయితే నిధులు తుడావి అయినప్పుడు  నిర్వహణ అవి  చేయాలి కానీ తన పరిధిలో ఉంచుకోవాలని ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద సొంత అస్తి కోల్పోతున్నట్లు చెవిరెడ్డి తెగ ఇదై పోతున్నారని అందరూ సెటైర్లు విసురుతున్నారు. పక్కనున్న హాథీరాంజీ మఠం భూములలో గ్రామస్తులు కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు వాటిని చెవిరెడ్డి కూల్చి వేయించారు. ఇప్పుడు తన దాకా వచ్చే సరికి నొప్పి తెలుస్తోందని గ్రామస్తులు దెప్పిపొడుస్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి కన్నీటి ఎపిసోడ్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu