చెన్నైకి మరో గండం

గతేడాది భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం తాలుకూ పీడకలను పూర్తిగా మరచిపోకముందే చెన్నైకి మరో గండం పొంచి ఉంది. అది కూడా మళ్లీ వర్షం రూపంలోనే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారడం, చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో చెన్నై, పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్తతో చెన్నై ప్రజలు ఉలిక్కిపడ్డారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో చెన్నైని వర్షాలు ముంచెత్తాయి. దీంతో వారం రోజుల పాటు మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే నిన్న అర్థరాత్రి నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని..ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేసింది.