కళ్లు తెరిచిన బీజేపీ.. టీడీపీ ని ఏమనొద్దు..!
posted on Dec 11, 2015 9:15AM

బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజీపీ నాయకులకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవహరించే నేతలు ఇప్పుడు కాస్త నెమ్మదించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనక్కర్లేదు.. బీజేపీ.. టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా.. బీజేపీ నేతలే ఎక్కువ పెత్తనం చూపించేవారు. అంతేకాదు టీడీపీ నాయకులపై కూడా ఆలోచించకుండా విమర్శల బాణాలు వదిలేవారు. గతంలో ఈ విషయంలో రెండు పార్టీల మధ్య విబేధాలు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబు కలుగజేసుకొని నచ్చజెప్పడంతో టీడీపీ తమ్ముళ్లు కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. ఇప్పుడు మిత్రుల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే బీజేపీ నేతలకు అర్థమవుతుందట. అంతేకాదు ఇందుకు సంబంధించి నేతలకు.. బీజేపీ పెద్దలు కొన్ని సూచనలు కూడా చేశారట. ఏపీ అధికారపక్షంతో జాగ్రత్తగా ఉండాలని.. అనవసరమైన వ్యాఖ్యలు.. విమర్శలు అస్సలు చేయొద్దంటూ..బాబుతో ఏదైనా సమస్యలు ఉంటే తమకు చెప్పాలే కానీ.. ఎవరూ సొంతంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించారట. మొత్తానికి చాలా కాలం తరువాత బీజేపీ నేతలకు కళ్లు తెరుచుకున్నట్టు ఉంది. అందుకే నిన్న మొన్నటి వరకూ టీడీపీ నేతలపై విరుచుకుపడిన బీజీపే నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.