చంద్రబాబుకు కేసీఆర్ ఎక్కువా? పవన్ ఎక్కువా?
posted on Oct 13, 2015 11:25AM

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికి ఆహ్వానాలు పంపే కార్యక్రమంలో పడ్డారు. ఇప్పుటికే ప్రధాని నరేంద్ర మోడీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా ఆయన కూడా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు ఇంకా అసలు రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాను.. రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజనకు కారణమైన కేసీఆర్ ను సైతం పిలవడానికి సిద్దమయ్యారు. వట్టిగా ఆహ్వానించడం కాదు.. కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్న ఇప్పుడు ఒకరి ఆహ్వానం విషయంలో మాత్రం ఆసక్తి నెలకొంది. అది ఎవరో కాదు.. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతు పలికి.. వారు గెలుపులో పాలుపంచుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
రాష్ట్రాన్ని విభజించే వరకూ నిద్రపోని.. నిరంతరం ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అని తిట్టి.. ఎప్పుడూ ఏదో విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిట్టుకుంటున్నా.. చంద్రబాబు కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తాను అని క్లారిటీ ఇచ్చారు. మరి అలాంటప్పుడు తన పార్టీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ని చంద్రబాబే స్వయంగా పిలుస్తారా లేక మంత్రులతో పిలిపిస్తారా అన్నది ఇప్పుడు అందరి సందేహం. పవన్ కళ్యాణ్ కు గౌరవ ప్రధమైన స్థానం కల్పిస్తారా అన్నది అందరి ప్రశ్న. ఒకవేళ చంద్రబాబు పిలిచినా పవన్ కళ్యాణ్ వెళ్తారా అనేది మరికొందరి అనుమానం. అంతేకాదు చంద్రబాబుకు కేసీఆర్ ఎక్కువనా లేక పవన్ కళ్యాణ్ ఎక్కువనా అని ఇద్దరికి ముడిపెట్టి చూసేవారూ ఉన్నారు. ఇన్ని అనుమానాలకు తెరపడాలంటే ఇంకా వేచి చూడాల్సిందే.