చంద్రబాబుకి జగన్ సలహా!
posted on Mar 17, 2015 3:02PM
.jpg)
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిల మధ్య ఈరోజు చాలా వాడివేడిగా చర్చ జరిగింది. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, కేవలం అధికార పార్టీకి చెందిన కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు దానిని ప్రభుత్వం ప్రారంభించిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దానివలన పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందేమోననే భయం తమకు ఉందని అన్నారు.
ఆయన మాటలకు తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్ళను రాయలసీమకు తరలించుకొంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తన అనుమతి తీసుకోవాలని అంటారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన వైకాపా నేత ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. అసలు పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్ళు అందిస్తే ఆయనకేమి అభ్యంతరమో తెలియదు కానీ చేతిలో బలమయిన మీడియా ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు పిచ్చి రాతలు వ్రాస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై నిన్న డిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులు సుదీర్గంగా చర్చించి, పోలవరం ప్రాజెక్టు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేప్పట్టాలని అందుకు అవసరమయిన నిధులు విడుదల చేస్తామని చెపితే, సాక్షిమీడియాలో ‘పోలవరానికి చంద్ర గ్రహణం’ అని హెడ్డింగ్ పెట్టి పిచ్చి వ్రాతలు వ్రాసారు. ఏదోవిధంగా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక భావనలు వ్యాపింపజేయడమే లక్ష్యంగా ఈవిధంగా ప్రచారం చేస్తున్నట్లుంది తప్ప రాయలసీమ ప్రజల గురించి కానీ, అక్కడి నీటి సమస్యల గురించి ప్రతిపక్షనాయకుడికి ఏమాత్రం అవగాహన, శ్రద్ద ఉన్నట్లు లేదు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం. ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా ప్రతీదానిని రాజకీయం చేయాలని చూస్తున్నారు. పైగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇక్కడ వల్లె వేస్తున్నారు. ఒకవేళ మీ నాయకుడికి ఈ విషయాల గురించి సరయిన అవగాహన లేకపోతే వెనుకన కూర్చొన్న సభ్యులలో చాలా మందికి దీనిపై మంచి అవగాహన ఉంది కనుక వారయినా ఆయనకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి లేకుంటే అందరూ చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు పోలవరంపై సాక్షి పత్రికలో ఈ పిచ్చిపిచ్చి రాతలు వ్రాసినందుకు ఆయనను ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పమనండి..అప్పుడు పట్టిసీమ గురించి మీరడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెపుతాము,” అని చంద్రబాబు నాయుడు కొంచెం ఆవేశంగా మాట్లాడారు.
అయితే అందుకు జగన్ చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన చంద్రబాబుకి జవాబిస్తూ “పత్రికలు తమ పని తాము చేసుకుపోతుంటాయి. మనం మన పని చేసుకుపోతుండాలి. నా గురించి, నా పార్టీ గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పేపర్లలో చాలా చెడుగా వ్రాసారు. కానీ నేను వాటిని ఏనాడు పట్టించుకోలేదు,” అని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే తన సాక్షి పత్రికలో ముఖ్యమంత్రి గురించి, ప్రభుత్వం గురించి తమ పత్రిక ఉద్దేశ్య పూర్వకంగానే చెడుగా వ్రాస్తోందని , కానీ దానిని పట్టించుకోవద్దని ఆయనే స్వయంగా ముఖ్యమంత్రికి చెపుతున్నట్లుంది.