ఆంధ్రప్రదేశ్ కి రాముడు, కృష్ణుడు, చంద్రుడు

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాముడు, కృష్ణుడు, చంద్రుడు రక్షగా నిలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు (చంద్రుడు), డీజీపీగా జేవీ రాముడు, (రాముడు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఐవై.ఆర్. కృష్ణా రావు (కృష్ణుడు) రక్షగా నిలబోతున్నారు. ముగ్గురూ కూడా మంచి కార్యదక్షులు, అనుభవజ్ఞులుగా పేరు తెచ్చుకొన్నవారే.

 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయినా ఐవై.ఆర్. కృష్ణారావు 1979 ఐఏయస్ బ్యాచ్ కు చెందినవారు. ఆయన పూర్తి పేరు ఇప్పగుంట యశోధరా రామకృష్ణారావు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో గల చౌటపాలెం గ్రామం. ఇప్పటి వరకు ఆయన విజయవాడ, నెల్లూరు జిల్లాలకు జాయింటు కలెక్టరుగా, నల్గొండ జిల్లా కలక్టరుగా, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉన్నతాధికారులలో ఆయనకు సౌమ్యుడు, కార్యదక్షుడనే మంచి పేరుంది. నిన్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలన్నిటినీ చక్కగా సమన్వయ పరుచుకొంటూ త్వరితగతిన సజావుగా రాష్ట్ర పునర్నిర్మాణం జరిగేందుకు కృషిచేస్తానని తెలిపారు.

 

రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జాస్తి వెంకట రాముడు 1981 బ్యాచ్ కు చెందిన ఐ.పీ.యస్ అధికారి. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లాలో తడ్డిమర్రి మండలంలో గల నర్సింపల్లి గ్రామం. ఆయన గుంటూరు, కరీం నగర్, వరంగల్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ లలో వివిధ శాఖలలో వివిధ హోదాలలో సేవలందించారు. ఆయన పోలీసు శాఖలో అన్ని విభాగాలలో కూడా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చెప్పట్టే ముందు వరకు ఆయన డీజీ ఆపరేషన్స్ గా సేవలందిస్తున్నారు. బాధ్యతలు చేప్పట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర తొలి డీజీపీగా తనకు అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని విధాల కృషి చేస్తానని, అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు.