ఏపీలో విపక్షానికి ఆయుధాన్ని అందించిన కేంద్రం!

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష తెలుగుదేశానికి కేంద్రం పదునైన ఆయుధాన్ని అందించింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మార్చేసిన జగన్ రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేస్తున్నారంటూ తెలుగుదేశం చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా ఏపీ మరో శ్రీలంకలా మారి పోతున్నదంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. ఇంత కాలం రాష్ట్రంలోని జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా అంచుకు తీసుకువచ్చిందని తెలుగుదేశం విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలసిందే.

ఇంత కాలం ఆ విమర్శలను పట్టించుకోకుండా.. రాష్ట్రానికి మరిన్ని అప్పులు చేయడానికి అనుమతులిస్తూ ప్రోత్సహించిన కేంద్రం.. ఉన్నట్టుండి ఏపీ ఆర్థిక పరిస్థితిపై బాంబు పేల్చి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంటూ ఏపీ సర్కార్ పై ఫైర్ అయ్యింది. శ్రీలంక సంక్షోభంపై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయంటూ ఓ పది రాష్ట్రాలను వేలెత్తి చూపిన కేంద్రం.. ఆ పది రాష్ట్రాలలోనూ ఏపీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తేల్చేసింది. కేంద్రం మంగళవారం నాటి అఖిలపక్ష భేటీలో పది రాష్ట్రాలను ప్రస్తావించినా, అందులో ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించని రాష్ట్రంగా ఏపీ ముందుపీటిన ఉంది.

కేంద్రం అప్పుల విషయంలో రాష్ట్రాలకు చేసిన సూచనలు సలహాలను పక్కన పెడితే.. ఏపీ తీరు అత్యంత దారుణంగా ఉందని కుండబద్దలు కొట్టింది.  ఏపీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు విపక్ష తెలుగుదేశంకు  పదనైన ఆయుధాన్ని అందించినట్లే అయ్యింది. ఇంత కాలంగా తాము ఏం చెబుతున్నామో అది వాస్తవమేనని కేంద్రం ఖరారు చేసిందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కేంద్రం మంగళవారం ఒక్క రోజే కేంద్రం గాలి తీసేసేలా మూడు అంశాలపై క్లారిటీ ఇచ్చింది. అవి ఒకటి పోలవరం, రెండు ప్రత్యేక హోదా, మూడు క్రమశిక్షణా రాహిత్యం. ఈ మూడు విషయాలలోనూ తెలుగుదేశం ఇప్పటి వరకూ ఏ విమర్శలైతే చేస్తూ వస్తోందో అవన్నీ అక్షర సత్యాలని కేంద్రం తేల్చేసింది.

పోలవరం జాప్యానికి గత తెలుగుదేశం ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే కారణమని ఇంత కాలం బుకాయిస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన సమాధానం శరాఘాతంలా తగిలింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పోలవరం పనులు నెమ్మదించాయనీ, ఇందుకు జగన్ సర్కార్ తీరే   కారణమని కేంద్రం కుండ బద్దలు కొట్టేసింది. అవసరాలకు సరిపడా నిధులు విడుదల చేయడం దగ్గర నుంచి, ప్రణాళికా రాహిత్యం, సమన్వయలోపం, అవగాహనా రాహిత్యం కారణంగానే పోలవరం సకాలంలో పూర్తి కాలేదని తేల్చేసింది. దీంతో ఇంత కాలం జగన్ సర్కార్ చెబుతున్న విషయాలన్నీ అసత్యాలని కేంద్రం తేల్చేసింది. అలాగే ప్రత్యేక హోదాపై వైసీపీ సర్కార్ కేంద్రంతో లాలూచీ పడిందన్న విమర్శలు వాస్తవమేనని తేల్చేస్తూ కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించింది.

గతంలో ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించడంపై విపక్ష నేతగా ఉన్న జగన్ విమర్శలు గుప్పించి, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా.. కనీసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద కేంద్రం ఇస్తానన్న నిధుల కోసం కూడా అడగలేదు.  ఇలా ఒకే రోజున కేంద్రం ఏపీలోని జగన్ సర్కార్ బండారాన్ని బయటపెట్టే మూడు అంశాలపై స్పష్టత ఇచ్చేయడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  సంక్షేమ పథకాల మాటున రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేస్తున్నారని.. ఆర్థిక దివాళాకోరు దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోందని ప్రధాన విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అక్షర సత్యాలని కేంద్రం చెప్పకనే చెప్పింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu