అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం లేదట!

 

కేంద్ర బడ్జెట్ లోఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో సర్వత్రా నిరసనలు ఎదురయిన తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చుతామని, అన్ని ప్రాజెక్టులకి అవసరమయిన నిధులు సమకూర్చుతామని, ఆర్దికలోటును భర్తీ చేసేందుకు కూడా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల కాబోతున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి స్వయంగా ప్రకటించారు. కానీ తెదేపా, బీజేపీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతోంది? అనే ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నేరుగా జవాబు చెప్పలేదు.

 

అయితే ఇటీవల ఒక కేంద్రమంత్రి మీడియాతో ‘ఆఫ్ ద రికార్డ్’ అన్నమాటలు ఆ ప్రశ్నలకు జవాబు తెలియజేస్తున్నాయి. “రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తీవ్ర ఆర్దికలోటు ఉందని చెపుతూనే మరోవైపు వేలకోట్ల పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తోంది. అటువంటప్పుడు రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలు ఉన్నాయని ఏవిధంగా భావించగలము? అందుకే ఆర్ధికలోటు భర్తీ చేయడానికి కేంద్రం కూడా ఆలోచించుకోవలసి వస్తోంది,” అని కేంద్రమంత్రి అన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆవిధంగా చెప్పడం నిజమో కాదో తెలియకపోయినా ఆ కారణం మాత్రం నిజంగా ఆలోచించదగ్గదే.

 

రాష్ట్ర ఆర్దికలోటును భర్తీ చేసేందుకు ఇంతవరకు ఎటువంటి నిధులు విడుదల చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట రుణాలను కొంతవరకు మాఫీ చేసింది. త్వరలో మరికొంత మాఫీ చేసేందుకు సిద్దమవుతోంది. రైతుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ భారం భుజానికెత్తుకొన్న రాష్ట్ర ప్రభుత్వం దానికోసం తన వద్ద ఉన్నంతలో నిధులు కేటాయిస్తోంది. అది చూస్తున్న కేంద్రానికి అనుమానం కలగడం సహజమే.

 

తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఈ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణాల మాఫీ చేయగలుగుతున్నప్పుడు కేంద్రం ఎందుకు సహాయం చేయాలి? ఒకవేళ చేసినా అప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా తమకూ నిధులు మంజూరుచేయమని అడగడం మొదలుపెడితే వాటికి కేంద్రం ఏమని జవాబు చెప్పుకోగలదు? అని ఆలోచిస్తే నిధుల విడుదలకు కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్ధమవుతుంది.

 

బహుశః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం నుండి ఇదే ప్రశ్నలు ఎదుర్కొని ఉండవచ్చును. అందుకే ఆయన కూడా కేంద్రంతో స్నేహంగా ఉంటూనే రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా కేంద్రంతో యుద్ధం చేయాలనుకోవడంలేదేమో.

 

అయినా రాష్ట్ర ప్రభుత్వం తనకు వచ్చిన ఆదాయంలో నుండి కొద్దికొద్దిగా తీసిపక్కనుబెడుతూ పంటరుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది తప్ప ఏకమొత్తంగా ఒకేసారి వేలకోట్ల రుణాలు మాఫీ చేసేయడం లేదు. దానివలన రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అంటే మంచికిపోతే చెడు ఎదురయినట్లయిందనుకోవాలేమో.

 

కానీ పంట రుణాల మాఫీతో, రాష్ట్రానికి ఈయవలసిన నిధుల విడుదలను లంకె పెట్టి తాత్సారం చేసినట్లయితే, దాని వలన కేంద్ర ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. చంద్రబాబు నాయుడు పంటరుణాల మాఫీ చేస్తామని ఎన్నికల కంటే చాలా ముందే ప్రకటించారు. అదే అంశాన్ని ఆయన నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ లతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రకటించారు. అంటే ఆవిషయం గురించి మోడీకి కూడా ముందే తెలుసని అర్ధమవుతోంది. కనుక ఇప్పుడు పంటరుణాల మాఫీని సాకుగా చూపుతూ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడానికి తాత్సారం చేయడాన్ని ఎవరూ హర్షించరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu