ప్రధానిని ఆహ్వానించేందుకు హస్తినకు చంద్రబాబు
posted on Apr 25, 2025 9:13AM

ప్రధాని నరేంద్ర మోదీ జీ అమరావతి పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమరాతి పనుల పున: ప్రారంభోత్సవానికి మే 2వ రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రోడ్ షోలో కూడా పాల్గొంటారు. మొత్తం మీద గంట సేపు సాగే ఆయన పర్యటన కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి చరిత్ర తెలిపేవిధంగా ఏర్పాటు చేయనున్న పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందం టున్నారు. కాగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం (ఏప్రిల్ 25) ఢిల్లీ వెళ్లనున్నారు.
అమరావతి పర్యటనకు ప్రధాని షెడ్యూల్ ఇలా ఉ:ది. మే2 మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో అమరావతిలో దిగుతారు. అక్కడ నుంచి సభాస్థలి వరకూ దాదాపు కిలోమీటర్ పైగా దూరానికి రోడ్ షో ద్వారా వెడతారు. ఈ రోడ్ షో దాదాపు 15 నిముషాల పాటు సాగుతుంది. అనంతరం అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. ఆ తరువాత అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఇలా ఉండగా ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికపై 100 మంది ఉంటారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాని సభ ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ కోసం ఆరుగురు మంత్రులలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల, నారా లోకేశ్, సత్య కుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలు ఉన్నారు. అలాగే ఈ పర్యటనకు నోడల్ అధికారిగా జి.వీరపాండియన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.