పైలెట్ పై పిల్లి అటాక్..

మన టైం బాగాలేనపుడు పులికే కాడు..అప్పుడప్పుడు పిల్లికి కూడా బయపడాల్సిందే. ఆ దాడి ఏ ఇంట్లోనో బయటో చేస్తే ఎలాగో అలా తప్పించుకోవచ్చు. అదే గాల్లో ఎగురుతున్న విమానం నడుపుతున్న పైలెట్ పైన దాడి చేస్తే. ఆ పైలెట్ పరిస్థితి ఏంటి ? అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏమవ్వాలి! విమానంలో పిల్లి ఏంటని అనుకుంటున్నారా.. చుడండి మీకే తెలుస్తుంది. ఎలా వెళ్లిందో ఏమో కానీ విమానం కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లిన ఓ పిల్లి పైలట్‌పై దాడికి దిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సూడాన్‌లో జరిగిందీ ఘటన.

టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం ఒకటి రాజధాని ఖర్టూమ్ నుంచి ఖతర్‌లోని దోహాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైన పిల్లి భయంతో పైలట్‌పై దాడిచేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పైలట్ గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని చెబుతున్నారు. విమానం కాక్‌పిట్‌లోకి పిల్లి ఎలా వచ్చిందన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ విమానాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో అది కాక్‌పిట్‌లోకి వెళ్లి ఉంటుందని అనుమానం పడుతున్నారు.