కార్మికులకు వార్నింగ్‌లు.. కామ్రేడ్లకు కౌంటర్లు..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బంద్. అన్ని పార్టీల మద్దతుతో రాష్ట్ర బంద్ సక్సెస్. ఇక ఉక్కు ఉద్యమ కేంద్రమైన విశాఖలో బంద్ విజయవంతం. బంద్ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓవరాక్షన్ వివాదాస్పదమవుతోంది. ఆయన అహంకారపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. టీడీపీ, వామపక్షాల నేతృత్వంలో బంద్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంటే.. బంద్ లో అధికార వైసీపీ రోల్ అంతంత మాత్రంగానే కనిపించింది. విజయసాయిరెడ్డి మాత్రం ఉదయం కాస్త హడావుడి చేసి నోరు పారేసుకుని విమర్శల పాలయ్యారు. 

విశాఖ బంద్‌లో పాల్గొన్న విజయసాయిరెడ్డికి కార్మికుల నుంచి సెగ తగిలింది. ఓ కార్మిక సంఘానికి చెందిన నాయకుడు పోస్కోపై విజయసాయిని నిలదీశాడు. పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ఆ కార్మిక నాయకుడు డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయిరెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందని విమర్శించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. ‘‘కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో.. నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవు’’ అంటూ ఆ కార్మిక సంఘ నాయకుడిపై నోరు పారేసుకున్నారు. విసుక్కుంటూ వెంటనే అక్కడి నుంచి వెల్లిపోయారు. విజయసాయిరెడ్డి తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమకేమీ తెలీనట్టుగా నటిస్తున్నారంటూ విజయసాయిపై, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఉక్కు కార్మికులు.

కార్మికులతో పాటు కామ్రేడ్లపైనా నోరు పారేసుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 'దీన్ని బంద్ అంటారా?' అంటూ మద్దిలపాలెంలో వామపక్ష నేతలపై విజయసాయి ఫైర్ అయ్యారు.  ‘‘ఒక్క వాహనం కూడా నిలపలేదు... అన్ని వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి. దీన్ని బంద్ అంటారా’’ అంటూ వామపక్ష నేతలను నిలదీశారు. విజయసాయి వ్యాఖ్యలకు సీపీఎం నేత కుమార్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. జెండా కూడా పట్టుకోలేదు’’ మీరు మాకు చెబుతున్నారా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత విజయసాయి మాట్లాడుతూ.. ‘‘కరోనాకు భయపడేవాళ్ళు.. ఉద్యమాలు ఏం చేస్తారు’’ అంటూ వామపక్షాలను కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా, రాష్ట్ర బంద్ సందర్భంగా విశాఖలో విజయసాయిరెడ్డి చాలా ఓవరాక్షన్ చేశారంటూ కార్మికులు, విపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి.