1600 కోట్లు.. స్టీల్ ప్లాంట్ లో మరో భూబాగోతం!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఉక్కు కర్మాగారం కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. పార్టీలు కూడా రోడ్డెక్కుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలతో అధికార పార్టీ కూడా బందులో పాల్గొంటుంది. దీంతో ఏపీలో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరుగుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృతం అవుతుండగానే.. మరో చీకటి ఒప్పందం బట్టబయలైంది. స్టీల్ ప్లాంట్, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్  మధ్య జరిగిన డీల్ వెలుగులోనికి వచ్చింది. హెచ్‌బీ కాలనీలో స్టీల్ ప్లాంట్‌కు చెందిన క్వార్టర్స్ భూములు 22.9 ఎకరాలు.. సుమారు రూ. 1600 కోట్ల విలువైన భూమి..అభివృద్ధి, అమ్మకాల  పేరుతో  ఒప్పందం కుదిరింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఈ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం  కలకలం రేపుతోంది.  20 ఏళ్ల నుండి ఈ భూమిని అమ్ముతారనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కదలిక వచ్చిందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చెబుతున్నారు.  

ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. అందుకు, కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సమయానికి జగన్ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలీకుండా ఈ ఒప్పందం జరిగే అవకాశమే లేదు. అంటే  జగన్ కు తెలిసే.. పోస్కో వైజాగ్ లో ఎంట్రీ ఇచ్చిందనేగా అర్థం? అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు కార్మిక సంఘాల నేతలు, విపక్ష నేతలు.