మాకు ముఖ్యం కులం! మేం మూర్ఖులం!

 

భారతదేశం ప్రత్యేకత చెప్పమంటే మీరేం చెబుతారు? గంగ నది, హిమాలయాలు, కంచి , మథురై ఆలయాలు, తాజ్ మహల్... ఇలాంటివి చెబుతారు కదా! కాని, నిజంగా మన దేశం ప్రత్యేకత కులం! అవును... కులం భారతదేశంలో తప్ప మీకు మరెక్కడా కనిపించదు. అంతే కాదు, మనోళ్లు కులాన్ని పుట్టగానే పట్టుకుని చచ్చేదాకా వదలరు. చచ్చినా వదలరు. దేశం కాని దేశంలో ఉద్యోగాలు చేసుకోటానికి వలసపోయినా కూడా ... అక్కడికీ కులాన్ని మనసులో కుక్కుకుని తీసుకెళ్తారు. ఒకవేళ మతం మారితే ఆ కొత్త మతంలోకి కూడా మోసుకెళతారు. ఎట్టి పరిస్థితుల్లో కులాన్ని మాత్రం మనసులోంచి, పేరు చివర్లోంచి తీసేయరు! దీన్నే మన రాజకీయ నేతలు కూడా బాగా వాడుకుంటున్నారు... 

 

ఓటర్లకు ఒక బలహీనత వుంటే వాడుకోని పొలిటీషన్ ఎవరు? ఉపయోగించుకోని పార్టీ ఏది? అదే పొలిటీషన్స్, పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు మాత్రం... గొప్పగా ఏం ఆలోచిస్తాయి? కులం ఆధారంగా టిక్కెట్లు ఇచ్చి, మ్యానిఫెస్టోలో హామీలు దట్టించి, ఓట్లు అడుక్కుని ఎలాగో పీఠం ఎక్కిన గవర్నమెంట్ పొద్దున్న లేస్తే కులం కులం అంటూనే వుంటుంది. దీనికి ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న భేదం లేదు. తెలుగు రాష్ట్రాలు మొదలు ఉత్తర్ ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రాలు, మణిపూర్, ఢిల్లీ లాంటి అతి చిన్న రాష్ట్రాలు... అన్నీ కులం కోలాహలంతో కళకళలాడిపోతుంటాయి. సెక్రటేరియట్లో సీఎం, రాజ్ భవన్ లో గవర్నర్, అసెంబ్లీలో స్పీకర్, కోర్టుల్లో జడ్జీలు... ఇలా అందరూ కులానికి లోబడే పని చేస్తుంటారు. చేయాల్సి వస్తుంది. 

 

మీడియా కూడా కులం కోణం దొరకగానే కుతూహలంతో కుతకుత ఊడికిపోతుంది. ఏ అగ్రవర్ణ వ్యక్తో, బీసీనో దురదృష్టకరంగా మరణిస్తే ''వ్యక్తి చనిపోయాడంటుంది''. కాని, ఎక్కడైనా దళితుడు నేల రాలితే, వెంటనే, ''దళితుడు చచ్చిపోయాడని'' చెబుతాయి మన పేపర్లు, ఛానల్స్! అసలు దళితుడ్ని మామూలు మనిషిగా చూడటమే మానేశాయి మీడియా సంస్థలు! అగ్రవర్ణాలు దాడి చేసి దళితుడ్ని ఇబ్బంది పెడితే తప్ప మరెప్పుడూ దళితుడ్ని దళితుడు, దళితుడు అంటూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మన జర్నలిస్టులకి ఆ సోయే వుండదు! ఇక మీడియా లాగే చాలా మంది  మేధావులు కూడా పూనకం వచ్చి ఊగిపోతారు కులం డిస్కషన్ వస్తే! 

 

స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో కులం చేసుకునే వృత్తులకి మాత్రమే పరిమితం అయ్యేది. కాని, ప్రజాస్వామ్యం వచ్చాక ఓట్ల రేసు మొదలయ్యాక కులం అందరికీ ప్రాణంలా మారిపోయింది. రాజ్యాంగం కులాన్ని క్రమంగా ధ్వంసం చేయమని చెబుతున్నా రిజర్వేషన్సు, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో టిక్కెట్లు, విద్యార్థుల హాస్టల్స్ లో రూంలు, యూనివర్సిటిల్లో సీట్లు, అఖరుకు పుణ్య క్షేత్రాల్లో ఉచిత భోజనాలు చేసే సత్రాలు... అన్నీ కులమే ప్రాతిపదికగా నడుస్తున్నాయి! అయినా అందరూ కులం వద్దని స్పీచ్ లు దంచటమే. అందరూ తమ కులం దోపీడికి, వివక్షకి గురవుతుందని వాపోయేవారే! అందరూ వెజిటేరియన్సేగాని... చికెన్ మాత్రం మాయమైందన్నట్టు... ఎవ్వరికీ ఇష్టం లేకున్నా కులం నిక్షేపంగా వుంటోంది! ఎలా? 

 

ప్రస్తుత భారతదేశంలో , ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ , క్యాంటీన్లలో కలిసి భోజనాలు చేస్తున్న పేద, మధ్యతరగతి జనం మద్య కులం దాదాపుగా లేనేలేదు. వున్నా ఒకర్ని ఒకరు ద్వేషించుకునేటంత, అసహ్యించుకునేటంత లేదు. ఎక్కడో ఇంకా అటరానితనం వున్నా దాన్ని రూపు మాపే ప్రయత్నం చేసిన వాడెవ్వడూ లేడు కాని గంటలు గంటలు చర్చలు మాత్రం చేస్తుంటారు. ఇలా కులం అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని, ఈగో సాటిస్ ఫై చేసుకోవాలని జనం కొంత మంది కోరుకోవటమే ప్రభుత్వాలకి కూడా కలిసి వస్తోంది. అన్ని కులాల్లో పేదలున్నా... పేదలందరికీ కులం వున్నా... మన గవర్నమెంట్లు మాత్రం ఒక్కో కులానికి ఏరి కోరి కార్పోరేషన్లు పెడుతున్నాయి. అక్కడ కాపు కార్పోరేషన్ తో ఒక కులానికి కాపు కాస్తే... ఇక్కడ బ్రాహ్మణ కార్పోరేషన్ తో బ్రహ్మరథం పట్టే ప్రయత్నం జరుగుతోంది! అసలు ఈ కార్పోరేషన్లు ఎందుకు? కొన్ని కులాలకే ఇస్తే మరి మిగతా కులాలు ఊరుకుంటాయా? ఎప్పుడూ ఏదో ఒక కులం వారొచ్చి పాలకుల్ని దేహి అని అడుగుతూ వుంటే భిక్షలు వేస్తూ వుంటారా? ఇవన్నీ సీరియస్ గా యాన్సర్సు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు!

 

వందల సంవత్సరాలుగా కులం వుంది. అది మనల్ని విభజించింది. వేధించింది. ఇప్పటికైనా మన కార్పోరేషన్ వరాలిచ్చే కపట ప్రభుత్వాలు... ఆ కులాన్ని ధ్వంసం చేస్తే బావుంటుంది. అది మీకు చేతకాకపోతే కులాన్ని కనీసం పట్టించుకోవటం మానేయండి. తమకు వీలైనప్పుడు జనమే కులాన్ని మరిచిపోతారు. అంతేగాని, కులాన్ని బలహీనపరచాల్సిన పాలకులే దానికి వరాల యూరియా వేసి పెంచి పోషించటం ... దారుణం,దుర్మార్గం! ప్రజలకి ఏ మంచి చేయాలనుకున్నా డబ్బున్నవాళ్లు, లేని వాళ్లు అన్న రెండు కులాల్నే దృష్టిలో పెట్టుకోండి. దాని ఆధారంగా అవసరమున్న వారికి అవకాశమున్నంత మేలు చేయండి. ఇలా చేస్తూ వుంటే దేశం తప్పక బాగుపడుతుంది. ఆఫ్ట్రాల్... కులం పట్టించుకోకుండా పని చేసే ఆర్మీ, ఇస్రో లాంటి వ్యవస్థలన్నీ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. కులం పోతే దేశం మొత్తం కూడా ఓ అద్భుతం అవుతుంది. ఒకవేళ కులమంటూ వుంటే ... భారతీయ కులం ఒక్కటే వుండాలి! కుల కార్పోరేషన్లు, రిజర్వేషన్లు వుంటే... అవ్వి ఇండియన్స్ అందరికీ చెందాలి! అర్హులందరికీ అందాలి! జై హింద్!