అక్కడ చంపటమే... చక్కటి వ్యాపారం!

పాకిస్తాన్ అంటే భారతీయులకు కోపం వుండవచ్చు. విసుగు, చిరాకు కూడా వుండవచ్చు. అందుకు కారణం కాశ్మీర్ విషయంలో ఆ దేశం ప్రవర్తించే తీరు. అక్కడ్నుంచి వచ్చే ఉగ్రవాదులు మన దేశంలో చేసే హింస. పాక్ పై మన కోపానికి ఎన్ని కారణాలు వున్నా... మనమే పాకిస్తాన్ పై జాలి కూడా చూపాల్సిన స్థితి దాపురించింది! ఈ మధ్య జరిగిన క్వెట్టా దాడే అందుకు ఉదాహరణ... 

 

పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశమని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరించింది. చైనా తప్ప మరెవరూ పక్క దేశం పక్కన నిలవటం లేదు. కాని, పాకిస్తాన్ కు తాను పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు పెద్ద ప్రాణగండంగా మారింది. ఒకప్పుడు భారత్ పై కసితో పాముల్లాంటి టెర్రరిస్టులకి ఆ దేశం పాలు పోసింది. ఇంకా పోస్తూనే వుంది. అది చాలదన్నట్టు అమెరికా దాడులు చేయగానే ఆఫ్గనిస్తాన్ నుంచి తాలిబన్లు వచ్చి తలదాచుకున్నారు. వాళ్లని కూడా మతోన్మాదంతో తనలో కలుపుకుంది. ఇక ఈ మధ్య పాక్ అంతర్గత ఉగ్ర మూకలు కాకుండా అంతర్జాతీయ ఇస్లామిక్ టెర్రరిస్ట్  ఆర్గనైజేషన్ కూడా ఆ దేశంలో జొరబడింది. రోజు రోజుకు ఐఎస్ఐఎస్ ప్రభావం ఎక్కువైపోతోంది పాక్ లో!

 

బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ పై మానవబాంబులు దాడి చేశారు. మొత్తం 60మందికి పైగా బలయ్యారు మారణకాండలో. అంతకు రెండితలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా చేసింది ఐఎస్. ఆ మతోన్మాద జిహాదీ సంస్థే స్వయంగా ప్రకటించుకుంది. ఇంతకు ముందు కూడా పాక్ లో ఇలాంటి భయంకర దాడులు బోలెడు జరిగాయి. పెషావర్ లో చిన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేసి స్కూల్ పై తెగబడ్డారు జిహాదీలు. ఇలా రోజూ నెత్తురోడుతున్నా పాకిస్తాన్ తోక మాత్రం సరిగ్గా మారటం లేదు. ఎన్ని వందల మంది చచ్చినా, ఆర్దిక వ్యవస్థ ఎంత దిగజారినా అంతకంతకూ ఉగ్రవాద ఉబిలో మునిగిపోతోంది. కారణం మతోన్మాదంతో కూడిన స్వార్థమే!

 

పాకిస్తాన్ లో భారతపై దాడులు చేసేందుకు ఉగ్రవాదుల్ని వేట కుక్కల్ని పెంచినట్టు పెంచుతారు. అయితే, రాను రాను ఈ ఉగ్రవాదం దందా బాగా లాభసాటిగా మారటంతో వాళ్లపై వాళ్లే దాడులు చేసుకుంటున్నారు. కిరాయి ఉగ్రవాదులు పాక్ లో బోలెడు మంది. వాళ్లకి మతోన్మాదం, మత ఛాందసంతో పాటూ డబ్బు కక్కుర్తి కూడా ఎక్కువే. దేశదేశాల్లోంచి వచ్చి పడే విరాళాలతో అక్కడి వందలాది ఉగ్రమూకలు పని చేస్తుంటాయి. వాటి పని పై నుంచి వచ్చే ఆర్డర్స్ అమలు చేయటమే. ఎవర్ని చంపమంటే వార్ని చంపేస్తారు ఈ కిరాయి టెర్రరిస్టులు. షియాలు సున్నీల్ని, బలూచ్ స్వతంత్ర యోధుల్ని, అహ్మదీయ శాఖకు చెందిన ముస్లిమ్ లని, అభ్యుదయ భావాలున్న ఆడవాళ్లని... ఇలా ఎవ్వర్నీ పడితే వార్ని బలి తీసుకుంటారు. అందుకు ఉదాహరణలే క్వెట్టా పోలీస్ క్యాంప్ పై దాడి, పెషావర్ లోని స్కూల్ పైన దాడి, చివరకు, మలాలా లాంటి సాదాసీదా అమ్మాయిలపై కూడా దాడి! మలాలా చదువుకుంటాను అన్నందుకు ఉగ్రవాదులు ఆమెని కాల్చేశారు. అలాగే, ఇంటర్నెట్ లో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేస్తోందని ఒక మోడల్ ని ఆమె బంధువులే కాల్చేశారు! ఇలా పాకిస్తాన్ లో అసలు చట్టం, ప్రభుత్వం భయమే లేదు. ఆ అరాచకత్వమే ప్రపంచానికి పదే పదే దారుణమైన దాడుల రూపంలో కనిపిస్తూ వుంటుంది! 

 

సర్జికల్ స్ట్రైక్స్ దాడుల తరువాత చాలా సార్లు ఇండియన్ ఆర్మీ గట్టి జవాబు ఇస్తోంది పాకిస్తాన్ కు. అందువల్ల కూడా ఆ దేశ సైనికులు కొంత మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం తన అధికార ఆర్మీని బలిపెడుతోంది పాకిస్తాన్ మూర్ఖత్వంతో! అయితే, ఇదంతా కేవలం మతోన్మాదంతో మాత్రమే జరగటం లేదు. హింస ఆ దేశంలో ఒక వ్యాపారం అయిపోయింది. అందుకే, ఇటు భారత్ తో శాంతినిగాని, అంతర్గతంగా ప్రశాంతతని, అభివృద్ధినిగాని ఉగ్రవాదులు బతకనివ్వటం లేదు. ఎంత కాలం అంతర్యుద్ధం చెలరేగితే అంత కాలం వాళ్లకి డబ్బులు వస్తుంటాయి. పాక్ ప్రభుత్వానికి అమెరికా, చైనాల నుంచి నిధులు వస్తుంటాయి. వాటితో జల్సాలు చేయటమే వారి లక్ష్యం! కాని, ఉగ్రవాదపు గోతి తొవ్వుకుంటోన్న పాక్ అతి త్వరలో దాంట్లో సమాధి అయ్యే ప్రమాదం ఖచ్చితంగా వుంది...