అత్యవసర పరిస్థితుల్లోనూ వేగంగా స్పందించరా?.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ లో వాయుకాలుష్యం తీవ్రత ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే.. హస్తినలో మూడు రోజులుంటే చాలు అలర్జీలు, గొంతు నొప్పి ఖాయమని చెప్పారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లోనూ ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడుంబిగించింది. అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై 18శాతం జీఎస్టీ ఆర్థిక భారంగా పరిణమించింది.

ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ సమంజసం కాదని పేర్కొంటూ, దానిని ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కపిల్ మదన్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను బుధవారం (డిసెంబర్ 24)విచారించిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కాలుష్యం కారణంగా జనం నానా ఇబ్బందులూ పడుతుంటే, అనారోగ్యానికి గురై మరణిస్తుంటే.. ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎటూ అందించలేరు.. కనీసం  ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీని కూడా తగ్గించలేరా? అంటూ నిలదీసింది. జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోంది? వేగంగా నిర్ణయాలు తీసుకోవడం చేతకాదా అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై  స్పందించేందుకు పక్షం రోజులు గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాదిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.  వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి (డిసెంబర్ 26)కు వాయిదా వేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu