సరిగ్గా ఎన్నికల వేళ ఆప్ కు కాగ్ షాక్!
posted on Jan 12, 2025 1:35PM

ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ కు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాగ్ నివేదిక మరో సారి ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందనీ, ఆ విధానం అమలులో పారదర్శకత లేదనీ కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆ నివేదిక పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక అంచనా వేసింది.
కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. వచ్చేనెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో ఆప్ కు నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ అగ్రనాయకులు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాగ్ నివేదిక లీక్ కావడంతో మరోసారి ఆప్ ప్రభుత్వ మద్యం విధానంపై చర్చ మొదలైంది. ఆప్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందంటూ బీజేపీ తాజాగా కాగ్ ను ఉటంకిస్తూ విమర్శలు గుప్పిస్తోంది.