త్వరలో మరో పదిఅసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు?
posted on Jun 17, 2012 10:10AM
రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికలు తప్పవనిపిస్తోంది. 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ ఉపఎన్నికల ప్రస్థానానికి ఎమ్మెల్యేలు సిద్ధమవు తున్నారు. ఈసారి ఉపఎన్నికలు కనీసం పదిస్థానాల్లో ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆల్ రెడీ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెలుగుదేశంపార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి, బొబ్బిలి కాంగ్రెస్ అమ్మేల్యే రావువెంకట సుజయ్ కృష్ణ రంగారావు, పార్వతీ పురం ఎమ్మెల్యే సవరపు జయమణి, తెలుగుదేశంపార్టీ నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), ఆ పార్టీ నుంచే మరొక ఎమ్మెల్యే కూడా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం జగన్ తో వీరందరూ మంతనాలు జరుపుతున్నారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో గంటన్నరసేపు మాట్లాడిన జగన్ వారికి సమీపంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహపడుతున్న ఎమ్మెల్యేల వివరాలను తెలిపారని సమాచారం.
మొత్తం పదిమంది ఎమ్మెల్యేలతో రెండోసారి ఉపఎన్నికల్లో విజయఢంకా మోగిస్తే ప్రభుత్వమే లొంగివస్తుందని ఎమ్మెల్యేలు కూడా జగన్ తో ఏకీభవించారట. ఈ సమాచారం మరోసారి సానుభూతి ఓట్లకు జగన్ పార్టీ సిద్ధమయింది. మరి తెలుగుదేశం, అధికార కాంగ్రెస్ పార్టీలు ఏమంటాయో మరి. చిత్రంగా కాంగ్రెస్ విప్ తులసిరెడ్డి మాట్లాడుతూ తాము మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని విజయమ్మతో సవాల్ చేసే సమయానికే ఆ పార్టీ సిద్ధమైంది. ఆ విషయం ఆయనకు తెలియకుండా జగన్ పార్టీ సిద్ధమా అని విజయమ్మను ప్రశ్నించారు. మరోవైపు అసలు 294 స్థానాలకు ఎన్నికలు పెడితే జగన్ సిఎం అయిపోతారు కదా అన్న ఆలోచనలో కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ, ఈ రెండేళ్ళ సమయాన్ని కాంగ్రెస్ వదులుకోదలచుకోలేదు.
ఈ రెండేళ్ళలో గట్టి పునాది వేసుకుని 2014 కల్లా బలమైన పార్టీగా ఎలా తయారవ్వాలనే సమాలోచనల్లో మునిగింది. ఏదేమైనా మరోసారి కనీసం పదిస్థానాల్లో ఉపఎన్నికకు జగన్ పార్టీ సిద్ధమైంది. దీనికి ఎమ్మెల్యేల రాజీనామాలకు రంగం సిద్ధమవుతోంది. ఆ పార్టీ ఉపఎన్నికల ద్వారా తాము బలంగా ఉన్నామని నిరూపించుకునే ఏ అవకాశాన్నీ వదులుకోదలచుకోలేదు. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా జగన్ ను సంప్రదిస్తున్న ఈ సమయంలోనే మరోసారి సత్తాచాటుకునే అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించేశారు.
అందుకే ఇప్పటిదాకా రాజీనామా చేద్దామా వద్దా అన్న ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే జాతీయస్థాయికి ఎదిగేందుకు ఇంకో ఎంపి ఉంటే బాగుంటుందని ఎంపి సబ్బం హరి కూడా రాజీనామా చేయాలని జగన్ ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. మళ్ళీ రోజుల్లోనే ఈ రాజీనామాలు తెరపైకి వస్తాయని పరిశీలకులూ భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో ఈ రాజానామాల తరువాతే అర్థమవుతుంది.