తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకం

 

ఎన్నెన్నో ఊహలతో, ఎన్నెన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఊహలు దూది పింజల్లా తేలిపోతున్నాయి. ఆ ఆశలు ఆవిరైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవకముందే అన్ని రంగాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామికరంగాలలో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా వుంది. ఈ రెండు రంగాలకూ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు మీద ఉన్న అంచనాలు మెల్లగా పట్టు సడలుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటు దిశగా వెళ్తోన్న సంకేతాలు పొడచూపినప్పటికీ ఎవరూ ఈ అనుమానాన్ని బయటకి వ్యక్తం చేయలేదు. అయితే సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక సంఘానికి రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడే ప్రమాదం వుందని చెప్పుకోవడంతో ఇప్పుడు అందరికీ ‘క్లారిటీ’ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక వ్యాపార సంస్థలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయాయని తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక సంఘం దగ్గర చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం సదరు వ్యాపార సంస్థల సంఖ్య వందల్లో వుంటాయని చెప్పినప్పటికీ, వాస్తవంగా చూస్తే ఆ సంఖ్య వేలకు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయిన వ్యాపార సంస్థల సంఖ్య మూడువేలను దాటుతోందని తెలంగాణ ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని వ్యాపార సంస్థలు తెలంగాణలోంచి జెండా పీకేసి ఆంధ్రప్రదేశ్‌లో పాతే అవకాశం వుందని కూడా అంటున్నాయి.

 

ఎల్ అండ్ టీ లాంటి అంతర్జాతీయ సంస్థ, జీఎమ్మార్ లాంటి జాతీయ స్థాయి సంస్థ కూడా తెలంగాణలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడంలో అంత సంతృప్తిగా లేవని తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రోరైలు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన మెలికలకు విసిగిపోయిన ఎల్ అండ్ టీ సంస్థ ఒక దశలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని కూడా లేఖ రాసేసింది. అలాగే తెలంగాణలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అనేక రహదారులను నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ రాష్ట్ర విభజన తర్వాత తమ రాబడులు తీవ్రంగా తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉందని భయపడుతున్నట్టు సమాచారం. దిగ్గజాల్లాంటి ఈ రెండు సంస్థలు రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి రావాలని అనుకునే ఇతర వ్యాపార సంస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 

ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు సమస్య తీవ్రంగా వేధిస్తూ వుండటం కూడా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రశ్నార్థకంలో పడింది. ఇంకా వర్షాకాలం వుండగానే, విద్యుత్ ఉత్పత్తి బాగా జరుగుతూ వుండగానే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి వేసవిలో కరెంటు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే పారిశ్రామిక వర్గాలు భయపడుతున్నాయి. ఇంకో మూడు నాలుగేళ్ళపాటు కరెంటు కష్టాలు ఇలాగే వుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కరెంటు పుష్కలంగా లభించే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోవడం మంచిదన్న అభిప్రాయం పారిశ్రామికవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి కరెంటు కష్టాలున్న తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం అనేది ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అటు వ్యాపారవర్గాల్లో, ఇటు పారిశ్రామిక వర్గాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న భయాన్ని పోగొట్టాల్సిన అవసరం వుంది.