బీఆర్ఎస్ ‘స్థానిక’ ఆశలు గల్లంతేనా?
posted on Sep 3, 2025 1:21PM

బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు. దానికి తోడు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయంగా అంతగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది.
అలాగే వరుస కేసులతో ఆ పార్టీ అగ్రనేతలంతా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు తాజాగా గోరు చుట్టుమీద రోకటి పోటు అన్నట్లుగా కవిత ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. సొంత పార్టీపైనే ఆమె నిరసన గళం ఎత్తడం.. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందుకు బాధ్యులు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లే అని ఆరోపణలు గుప్పించడం.. దీంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేయడం జరిగిపోయింది. ఎలా చూసినా ఈ పరిణామం బీఆర్ఎస్ కు శరాఘాతమే అని చెప్పాలి.
ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించే అవకాలున్నాయంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కవిత త్వరలో తెలంగాణ రాజ్య సమితి పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదే జరిగితే.. గ్రామీణ తెలంగాణ ఇప్పటికీ ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ గా ఉన్న టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీగా గండి కొడుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇది స్థానిక సమరంలో బీఆర్ఎస్ కు భారీ నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు.