తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షలకు ల్యాబ్.. ప్రారంభించిన బీఆర్ నాయుడు
posted on Jul 23, 2025 8:37AM
.webp)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్ ప్రారంభమైంది. భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం, ఇతర ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఇసుమంతైనా రాజీపడే ప్రశక్తే లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తిరుమలలోనే ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా తిరుమలలో సమర్థవంతంగా పరీక్షించవచ్చు. దీనివల్ల ఆహార ప్రమాణాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఈ ల్యాబ్‌లోని అధునాతన యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ విరాళంగా అందించింది. ల్యాబ్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన బీఆర్ నాయుడు ఈ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక త్వరలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.