నేడు జగన్ని కలవనున్న బొత్స

 

వైకాపా నేతలు నిన్న హైదరాబాద్ లో బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలో చేరవలసినదిగా ఆహ్వానించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఆయన స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసానికి వెళ్లి తుదివిడత చర్చలు జరుపబోతున్నారు. అనంతరం ఆయన పార్టీలో చేరికపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చేనెల 3వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు మంగళగిరిలో సమర దీక్ష (నిరాహార దీక్ష) చేయబోతున్నారు. కనుక వీలయితే అదే రోజున బొత్స పార్టీలో చేరవచ్చును. లేకుంటే జూన్ 9న తన స్వంత జిల్లా అయిన విజయనగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరవచ్చునని సమాచారం. బొత్స సత్యనారాయణ చేరికను జిల్లాకు చెందిన వైకాపా నేతలు చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ, విశాఖ, విజయనగరం జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనవంటి బలమయిన నాయకుడు అవసరమని జగన్ భావిస్తున్నందున ఆయనను పార్టీలో చేర్చుకోనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా శాసనమండలికి పోటీ చేయించి మండలిలో వైకాపా పక్ష నేతగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu