చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ విమర్శలు

 

ఇవాళ్ళ గుంటూరులో కాంగ్రెస్ పార్టీ చేప్పట్టిన ఒక్కరోజు నిరసన దీక్షలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రులిరువురూ ప్రత్యేక హోదా గురించి రోజుకొక మాట చెపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, నిర్మలా సీతారామన్ కి ఈ విషయంపై ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి సింగపూర్, జపాన్, చైనా అంటూ విదేశాలలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం అవసరమయితే న్యాయ పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఇదే బొత్స సత్యనారాయణ కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఏవో కారణాల వలన ఆయన బీజేపీలో చేరలేకపోయారు. ఒకవేళ చేరి ఉండి ఉంటే, ఈరోజు ఆయన బీజేపీని, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ లను వెనకేసుకువచ్చి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించేవారేమో? బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఒక వెలుగు వెలిగినప్పటికీ, తన కుటుంబ సభ్యులకి తప్ప రాష్ట్రానికి కానీ, స్వంత జిల్లా విజయనగరానికి గానీ చేసిందేమీ లేదని జిల్లా ప్రజలే చెప్పుకొంటారు. రాష్ట్రంలో మరే ఇతర కాంగ్రెస్ నాయకుడికి లేనంత ప్రజా వ్యతిరేకత ఆయన మూటగట్టుకొన్నారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు, మూడు సార్లు విదేశీ పర్యటనలు చేసివస్తే తప్పు పట్టడం చాలా హాస్యాస్పదం.

 

కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళ కాలం చేయలేని, కనీసం ఊహించలేని వైజాగ్, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, రాష్ట్రంలో అనేక దేశ విదేశీ పరిశ్రమల ఏర్పాటు వంటి అనేక పనులను తెదేపా, ఎన్డీయే ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. బొత్స సత్యనారాయణ తదితర నేతలు వాటి ప్రస్తావన చేయకుండా ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడుతూ ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈరోజు గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నేతలు కేవలం తమ ఉనికి కాపాడుకోవడం కోసమే చేస్తున్నారనే సంగతి సామాన్య ప్రజలకు కూడా అర్ధమవుతూనే ఉంది. అటువంటప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిందించడం వలన వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా పోవచ్చును.