మనసు మార్చకోని రంగారావు,
posted on May 28, 2012 2:13PM
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై కోపంతో విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె. రంగారావు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి దగ్గర వుతున్నారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలి ఎమ్మెల్యే కూడా రంగారావే కావటం గమనార్హం. బొత్స నీడలో తనకు భవిష్యత్తు ఉండదన్న నమ్మకంతోనే రంగారావు జగన్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ఈయన్ని కాంగ్రెస్ పార్టీ వదలవద్దని కేంద్రమంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కోరారు. చంద్రదేవ్ ను తన గురువుగా రంగారావు నమ్ముతారు. అలానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఈ నిర్ణయాన్ని మార్చుకోమని కోరారు. అయితే రంగారావు తనది స్థిర నిర్ణయమని కేంద్రమంత్రికి తెలియజేశారని సమాచారం. జిల్లాలో బొత్స సత్యనారాయణ వల్ల తాను అనేక సమస్యలకు గురయ్యానని ఆయన కేంద్రమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన నియోజక వర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని బొత్స చేరదీసి తనకు సమస్యలు సృష్టించారని దీనిపై తాను గతంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అందుకే త్వరలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంగారావు అంటున్నారు.