ఇప్పటికిప్పుడు మిమ్మల్ని రేప్ చేస్తే ఏంచేయగలం.. బీజేపీ నేత ఈశ్వరప్ప
posted on Oct 19, 2015 3:32PM

రాజకీయ నాయకులు మహిళల అత్యాచారాలపై అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటైపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కర్ణాటకు చెందిన నేత కె.జె జార్జ్ ఇద్దరు కలిసి రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని నలుగురైదుగురు కలిసి రేప్ చేస్తేనే దానిని గ్యాంగ్ రేప్ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆతరువాత తేరుకొని సారీ చెప్పారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మరోనేత కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి బుక్కయ్యారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఒక మహిళా జర్నలిస్ట్ ఈశ్వరప్పని మహిళా అత్యాచారాలపై ప్రశ్న అడుగగా.. దానికి ఆయన ఇపుడు మీరు నా ఎదుట నిలబడి ప్రశ్నలడుగుతున్నారు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకెళ్లి రేప్ చేస్తే ప్రతిపక్షంగా మేమేం చేయగలం అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఆ జర్నలిస్ట్ ఒక్కసారిగా ఖంగుతిని అక్కడికక్కడే ఈశ్వరప్పకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలు ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఈశ్వరప్ప సారీ చెబుతూ తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని వివరణ ఇచ్చారు.