కర్ణాటకలో కాంగ్రెస్ పై సమరమే

కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని జెడిఎస్ నేత కుమార స్వామి, మాజీ ముఖ్యమంత్రి  బొమ్మయ్ ఒకే వేదిక మీద మాట్లాడటం చర్చనీయాంశమైంది. తాజాగా ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అక్రమాల పుట్టగా మారి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే నైస్‌ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌ డిమాండ్‌ చేశాయి. విధానసౌధలోని జేడీఎస్‌ కార్యాలయంలో  మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, బసవరాజ్‌బొమ్మై సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. టోల్‌ రూపంలో ప్రజలను నైస్‌ కంపెనీ దారుణంగా వంచించిందని ఆరోపించారు. ‘నైస్‌’కు అదనంగా ఇచ్చిన భూమిని సైతం తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందేనన్నారు. నైస్‌ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని అప్పుడే అక్రమాలకు సంబంధించిన నిజాలు వెలుగుచూస్తాయన్నారు. శాసనసభ సంయుక్త సభాసంఘం నివేదిక, ధర్మాసనం ఆదేశాలు నైస్‌ కంపెనీలో అక్రమాలు జరుగుతున్నట్టు పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. నైస్‌ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే శాసనసభ బయటా, లోపల తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. నైస్‌ కంపెనీ రైతుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే అక్రమాలపై నెత్తీ నోరు బాదుకున్న సిద్దరామయ్య ఇప్పుడు చిత్తశుద్ధిని ప్రదర్శించాలని సవాల్‌ విసిరారు. ఇదే అంశంపై శాసనసభలో చర్చకోసం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా నిబంధన 69 కింద చర్చిస్తామని ప్రకటించినా అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర రైతుల, ప్రజల హితాన్ని గాలికి వదిలేస్తున్న, సామాన్యుల భూమిని కబ్జా చేస్తున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీని తలపిస్తున్న నైస్‌పై కాంగ్రెస్‌ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేస్తే ప్రభుత్వానికి రూ.30వేల కోట్లకుపైగా నిధులు మిగులుతాయన్నారు. నైస్‌ రహదారి ప్రాజెక్టులో అంతకు ముందు కుదిరిన ఒప్పందాల ప్రకారం 2012లోగా కాంక్రీట్‌ రోడ్డు నిర్మించకపోతే అంతవరకు టోల్‌ వసూలు చేయరాదన్న నిబంధన స్పష్టంగా ఉందన్నారు. ఈ నియమాలను గాలికి వదిలి ఇంతవరకు సదరు కంపెనీ టోల్‌ పేరిట ప్రజలనుంచి రూ.1325 కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్నారు. నిర్దాక్షిణ్యంగా సదరు మొత్తాన్ని నైస్‌ కంపెనీ ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu