బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో.. ఉచితాలకే పెద్దపీట
posted on Jan 17, 2025 4:35PM
.webp)
చెప్పేటందుకే నీతులు అన్న విషయాన్ని బీజేపీ మరోమారు రుజువు చేసింది. పలు సందర్భాలలో ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత హామీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల వేళ విజయం కోసం ఉచితాలపైనే ఆధారపడ్డారు.
ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ఇచ్చే ఉచిత హామీలు దేశ భవిష్యత్ కు, ప్రగతికీ అత్యంత ప్రమాదకరమని పలు సందర్భాలలో మోడీ అన్నారు. తన ప్రభుత్వం ఉచిత హామీలకు దూరంగా ఉంటుందనీ, దేశ భవిష్యత్ , మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి కేంద్రీకరిస్తుందనీ గతంలో పలు సందర్భాలలో చెప్పిన మోడీ ఎన్నికలలో బీజేపీ విజయానికి మాత్రం ఆ ఉచిత హామీలపైనే ఆధారపడుతున్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన ఎన్నికల మేనిఫొస్టోను ఉచిత హామీలతో నింపేసింది. సంకల్ప పత్రం పేరిట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా శుక్రవారం (జనవరి 17)న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఇప్పటికే అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అవికాకుండా పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు హోళీ, దీపావళి పండుగలకు ఒక్కో సిలిండర్ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 60-70 ఏళ్ల మధ్య వృద్ధులకు నెలకు రూ. 2,500, 70 సంవత్సరాల పైబడి వారికి రూ.3 వేలు అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే మహిళలకు 2500 రూపాయలు పింఛను, ఢిల్లీలోని అనధికార మురికివాడలలో అటల్ క్యాంటిన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది.