గుజరాత్ కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు!
posted on Mar 8, 2025 3:19PM

కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారా? ఔను ఉన్నారనే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన రాహుల్ గాంధీ చేసిన ఈ కోవర్ట్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ లో సగం మందికి పైగా కాంగ్రెస్ నాయకులు బీజేపీకి బీ టీమ్ గా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వారినందరినీ గేలం వేసి పట్టుకుని మరీ బయటకు పంపేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ లో నాయకులకు కొరవ లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసేవారెవరైనా, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రశక్తే లేదన్నారు. గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తలలో కొందరు పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ పార్టీ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా అనుసరించేవారు, అలాగే పార్టీ, ప్రజలను పట్టించుకోకుండా బీజేపీ తో అంటకాగేవారు మరి కొందరు ఉన్నారని రాహుల్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ఆ రాష్ట్ర నాయకులు అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 22 శాతం ఓట్లు పెరిగాయన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ కు 40 శాతం ఓటు బ్యాంకు ఉందనీ, అయితే కొందరు నేతలు బీజేపీతో కలిసి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు. అటువంటి నేతలను ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ చేసిన ఈ కోవర్టు వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాహుల్ ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ను ప్రస్తావించి, ప్రశంసించడంతో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ మధ్య గ్యాప్ అంటే జరుగుతున్న ప్రచారానికి ఫఉల్ స్టాప్ పెట్టినట్లైంది.