ఆదివారం అసలు సిసలు మజా.. క్రికెట్ ఫెస్ట్
posted on Mar 8, 2025 4:02PM

క్రికెట్ అభిమానులు ఆదివారం (మార్చి9) అసలు సిసలు మజా ఎంజాయ్ చేయబోతున్నారు. ఔను దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం (మార్చి 9)జరగనుంది. ఓటమనేదే తెలియకుండా సాగుతున్న టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. న్యూజిలాండ్ కూడా భారత్‌కు దీటుగా ఉంది. అయితే అన్ని విభాగాల్లో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నా.. దుబాయ్‌లో స్పినర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్‌ఇండియా అజేయగా ఫైనల్ చేరడంలో స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకం. బుమ్రా లాంటి మేటి ఫాస్ట్‌బౌలర్ లేకున్నా.. జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే కారణం స్పిన్నే. గ్రూప్ దశలో, సెమీస్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్ దళం.. భారత్ పనిని తేలిక చేసింది. ఆదివారం ఫైనల్లోనూ స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్‌లతో టీమ్‌ఇండియా స్పిన్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కానీ న్యూజిలాండూ తక్కువేమీ కాదు. టోర్నీలో స్పిన్ వనరులలో భారత్‌కు దగ్గరగా వచ్చే జట్టేదయినా ఉందంటే అది కివీసే. బ్రాస్‌వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో మంచి స్పిన్ ప్రత్యామ్నాయాలు ఆ జట్టుకున్నాయి. పిచ్ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో రెండు జట్ల స్పిన్నర్ల మధ్య రసవత్తర పోటీ ఖాయంగా కనిపిస్తుంది. స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయడం, బ్యాటింగ్‌లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
భారత్ తిప్పేసిందిలా..
ఛాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్‌లన్నింటీనీ దుబాయ్‌లోనే ఆడిన టీమ్‌ఇండియా.. స్పిన్‌కు బాగా సహకరిస్తున్న పిచ్‌లపై అద్భుత ఫలితాలు రాబట్టింది. నలుగురు స్పిన్నర్లలో ప్రతి ఒక్కరూ జట్టు ముందంజ వేయడంలో తమదైన పాత్రను పోషించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కీలక సమయాల్లో వికెట్లను అందించడమే కాకుండా.. పరుగుల ప్రవాహానికీ కళ్లెం వేశారు. చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ మినహా స్పిన్నర్లంతా ఓవర్‌కు అయిదు లోపే పరుగులివ్వడం విశేషం. కుల్‌దీప్ కూడా 4 మ్యాచ్‌ల్లో 5.01 ఎకానమీతో, 5 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ 2 మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో 7 వికెట్లు, అక్షర్ 4 మ్యాచ్‌ల్లో 4.51 ఎకానమీతో 5 వికెట్లు), జడేజా 4 మ్యాచ్‌ల్లో 4.78 ఎకానమీతో4 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేశారు. సీనియర్ స్పిన్నర్ జడేజా మధ్య ఓవర్లలో విశేషంగా రాణించాడు. సెమీస్‌లో బ్యాటింగ్ అనుకూల పిచ్‌పై ఆసీస్‌ను అతడు నిలువరించిన తీరు అద్భుతం. మరీ ముఖ్యంగా కుడిచేతి వాటం బ్యాటర్లపై అక్షర్, జడేజా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. ఇక ఆఖరి ఓవర్లలో కుల్‌దీప్‌పై రోహిత్ రాణిస్తున్నాడు. ఇక లెగ్‌స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టోర్నీలో ఆలస్యంగా అవకాశం దక్కించుకున్నా.. తన మిస్టరీ స్పిన్‌తో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్న అతడి నుంచి కివీస్‌కు పెను సవాలు తప్పదు.
భారత స్పిన్నర్లలాగే న్యూజిలాండ్ స్పిన్నర్లు టోర్నీలో సత్తా చాటారు. గ్రూప్ మ్యాచ్‌లో వాళ్లను ఎదుర్కోవడంలో టీమ్‌ఇండియా విజయవంతమైనా.. ఫైనల్లో వాళ్లను తేలిగ్గా తీసుకోవడానికి వీళ్లేదు. పార్ట్ టైమర్ ఫిలిప్స్ తప్ప కివీస్ స్పిన్నర్లంతా ఓవర్‌కు అయిదు లోపే పరుగులిచ్చారు. శాంట్నర్ కివీస్ బౌలింగ్‌కు మూలస్తంబంలా నిలిచాడు. బ్రాస్‌వెల్, రచిన్ ఆకట్టుకున్నారు. స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతోనే ఇటీవల భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను కివీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.