జగన్ కు బైబై.. బాబుకు సైసై.. సోము కొత్త పలుకు

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే ఏపీలో రాజకీయ వేడి వేసవిని మించి పోయింది.  అన్ని పార్టీలకూ  ఎన్నికల సెగ తగిలింది. దాంతో ఇప్పని నుంచే వ్యూహరచనలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.   అనూహ్య పొత్తులూ, ఎత్తులతో రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి  గురి చేస్తున్నాయి. 
అందులో భాగమే వైకాపా, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు అంశం. నిన్న మొన్నటి వరకూ కనీసం ఊహా మాత్రంగానైనా ఎవరి మదిలోనూ కదలాడని ఈ కొత్త పొత్తు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వంతో తెరపైకి రావడమే కాదు....ఈ పోత్తు ఖాయమనేలా వైసీపీ, కాంగ్రెస్ నేతల నుంచి సంకేతాలు వచ్చేశాయి. దీంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయ ఎరీనాలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 
బీజేపీ- తెలుగుదేశం పార్టీల మధ్య అంతరం కనుమరుగైపోతుందన్నసంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఓటు చీల నివ్వను అంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తెలుగుదేశంతో కలిసి పని చేస్తుందన్న బలమైన సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా అదే బాటలో నడుస్తున్నదని పించేలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయి.
తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు తాజాగా  జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు నయం అన్నట్లుగా మాట్లాడారు. చంద్రబాబు  పాలన సాఫీగా ఉందని, ప్రస్తుతం జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందనీ వ్యాఖ్యలు చేశారు. 
ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే బీజేపీ కూడా పవన్ కల్యాణ్ పార్టీలా తెలుగుదేశంతో కలిసి రానున్న ఎన్నికలలో పని చేయనుందని భావించవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు సోము వీర్రాజు లేదా బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారడానికి కారణమేమిటన్న ప్రశ్నకు వైసీపీ, కాంగ్రెస్ ములాఖత్ అనే సమాధానం వస్తుంది.
 
ఇంత కాలం జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఒక విధంగా వైసీపీ బీజేపీ బీటీమ్ అన్నవిధంగా రాష్ట్రంలో పాలన సాగించారు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు బిగించడం దగ్గర నుంచి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి మద్దతు పలకడం వరకూ జగన్ కమలం కనుసన్నలలో పాలన సాగించారు. అయితే...పీకే కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతోనే జగన్- బీజేపీల మధ్య దూరం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖరారైన నేపథ్యంలో కమలం కూడా వ్యూహం మార్చి ఇప్పటి దాకా జగన్ తప్పిదాలను, పాలనా వైఫల్యాలను విమర్శించే విషయంలో ఆచి తూచి  వ్యవహరించే వైఖరికి తిలోదకాలివ్వాలన్న నిర్ణయానికి వచ్చేసింది. అదే సమయంలో  రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశంలో పూర్వపు మైత్రిని పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా వైసీపీ ప్రత్యర్థి అయిన తెలుగుదేశంలో జట్టు కట్టడం వల్ల వచ్చే ఎన్నికలలో సీట్ల పరంగా కూడా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అందుకే జగన్ వైఫల్యాలను ఎండగట్టడంతో ఊరుకోకుండా గత చంద్రబాబు పాలన ఎంతో నయం అంటూ కితాబులిస్తున్నది. ఏది ఏమైనా వైసీపీ కాంగ్రెస్ పొత్తు అంశం రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు తెరలేపింది. పాత మిత్రులకు ఒక దగ్గరకు చేరుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu