అప్పుడు అడగని జగన్ ఇప్పుడు డిల్లీ ఎందుకు బయలుదేరుతున్నట్లో

 

కేంద్ర బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు, ప్రతిపక్షాలు చివరికి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. కానీ వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గానీ పెదవి విప్పలేదు. తెదేపా నేతలు నిలదీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్లమెంటులో తమ యంపీ సోమయాజులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు గనుక తను ఈ విషయంపై స్పందించనవసరం లేదని చెప్పారు. అంటే ఏదో ప్రశ్నించాలి గాబట్టి ప్రశ్నిస్తున్నాము తప్ప తమకి ఆ ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పారు. పైగా “కేంద్రం నిధులు విడుదల చేయనప్పుడు తెదేపా తక్షణమే బీజేపీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ఎందుకు తెగతెంపులు చేసుకోవడం లేదు?” అని జగన్మోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

 

“ఒకవేళ తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకొని, ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసినట్లయితే, వైకాపా ఆ స్థానంలోకి ప్రవేశించాలనుకొంటోందేమో?” అని బీజేపీ నేత వెంకయ్యనాయుడే స్వయంగా అనుమానం వ్యక్తం చేసారు. తెదేపా నేతలు కూడా అటువంటి అనుమానమే వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖండించకపోవడాన్ని గమనిస్తే వారి అనుమానాలు నిజమేనని అనిపించక తప్పదు.

 

ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోతే దానితో తెగతెంపులు చేసుకోమని సలహా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పనిగట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధానిని వెళ్ళడం చూస్తే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వంత పార్టీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టమవుతోంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయనప్పుడు ఆ అంశంపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పనిగట్టుకొని అదేపని మీద డిల్లీ బయలుదేరడం అనుమానం కలిగిండం సహజమే.

 

ఇక ఈ వ్యవహరాని మరో కోణం నుండి కూడా చూడవలసి ఉంటుంది. తెదేపాకు రాజకీయ శత్రువయిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర కేంద్రమంత్రులు అడగగానే అపాయింటుమెంటు ఇవ్వడం చూస్తే, బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ అవసరాలాను దృష్టిలో ఉంచుకొని వైకాపాతో సఖ్యత పాటిస్తున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత కనుకనే ఆయనకి ప్రధాని అంత త్వరగా అడిగినవెంటనే అపాయింటుమెంటు ఇస్తున్నారని బీజేపీ సర్ది చెప్పుకోవచ్చును. కానీ దాని వలన రాష్ట్ర ప్రజలకు, తన పార్టీ క్యాడర్ కి కూడా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే సంగతి బీజేపీ అధిష్టానం విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటోంది గనుకనే పార్టీ వ్యూహాలను, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైకాపాతో కూడా బీజేపీ అధిష్టానం స్నేహం చేస్తోందనే భావన ప్రజలలో ఏర్పడుతోంది. దాని వలన బీజేపీకి లాభమో నష్టమో స్వయంగా బేరీజు వేసుకోవలసి ఉంటుంది.