కాంగ్రెస్ స్వయంకృతాపరాధం

 

రాష్ట్ర విభజన ఐడియాతో తనకు సవాలుగా నిలిచిన వైకాపా తెదేపాలను చిత్తు చేయాలనుకొన్న కాంగ్రెస్ పార్టీ చేజేతుల్లా కొత్త సమస్యలు సృష్టించుకొని ఇప్పుడు తీరికగా బాధపడుతోంది. ఇంతవరకు వచ్చిన తరువాత ఇక రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. వెనక్కి తగ్గితే టీ-కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కూడా ఖాయం. ఇక, కాంగ్రెస్ భరతం పట్టేందుకు తెరాస ఎలాగు సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మలేమని చెపుతున్న తెరాస నేత కేసీఆర్ ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే పేరుతో మళ్ళీ ఉద్యమానికి సంసిద్ధంఅవుతున్నారు.

 

ఇక, సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అంటోనీ కమిటీ ముందు వాదనలు చేస్తున్నారు. ఇక మిగిలిన సీమాంధ్ర నేతలు కూడా అధిష్టానానికి ఎదురుతిరుగుతున్నట్లుగానే కనిపిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం దైర్యంచేసి ముందుకు సాగుతుండటంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమాలు నానాటికి తీవ్ర తరమవుతున్నాయి. రాజమండ్రీ శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు అయితే మరో అడుగు ముందుకు వేసి త్వరలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి ‘ఇందిరా కాంగ్రెస్ పార్టీ’ పెట్టే అవకాశం ఉందని బాంబు పేల్చారు.

 

కాంగ్రెస్ తీసుకొన్ననిర్ణయన్ని వ్యతిరేఖిస్తూ ప్రభుత్వోద్యోగుల నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వం పూర్తిగా స్తంభించిపోయింది. ఇవే పరిస్థితులు మరికొంత కాలం కొనసాగినట్లయితే అది రాష్ట్రంపై సుదీర్గ కాలంపాటు తీవ్ర దుష్పరిణామాలు చూపడం ఖాయం. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి బోడో ల్యాండ్, గోర్ఖ ల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కూడా జోరందుకోవడంతో కాంగ్రెస్ పార్టీ చేజేతులా మరిన్ని కొత్త ఇబ్బందులు సృష్టించుకొన్నట్లయింది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను దెబ్బతీయబోయి తాను దెబ్బతినడమే కాకుండా రాష్ట్రంలో రావణకాష్టం రగిలించి దానిని ఆర్పడం చేతకాక కాలక్షేపం చేస్తున్నట్లుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu