ద‌ళిత మ‌హిళా జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్‌కు అవ‌మానం.. ఇదేనా కేసీఆర్ దళిత బంధు లక్ష్యం? 

దళితుల దశ మార్చడమే తన లక్ష్యమంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.దళిత బంధుతో వారి తలరాత మారుస్తానంటున్నాదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం కొత్త పథకం తీసుకువచ్చామని చెబుతున్నారు. దళిత బంధుతో హడావుడి చేస్తున్నారు గులాబీ బాస్. ఇదంతా ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం దళిత నేతలకు విలువు లేకుండా పోతోంది. టీఆర్ఎస్ నేతలే దళిత నేతలను అవమానిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దళిత బంధు పథకంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్న రోజే... దళిత ప్రజా ప్రతినిధికి ఘోరమైన అవమానం జరగడం కలకలం రేపుతోంది. కేసీఆర్ సర్కార్ తీరుకు అద్దం పడుతోంది. 

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ గా దళితురాలైన జ‌క్కు హ‌ర్షిణి ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా ఆమెకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ హ‌ర్షిణి రాజ‌కీయ ఉనికి లేకుండా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ప్రొద్బ‌లంతో పార్టీలో, జ‌డ్పీ పాల‌క వ‌ర్గంలోనూ ఆమెపై వివ‌క్ష కొన‌సాగుతోంద‌న్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్న‌తాధికారులు కూడా ఆమెకు ప్రోటోకాల్ ప్ర‌కారం గౌర‌వం ఇవ్వడం లేదని చెబుతున్నారు. భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఏ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి ఆమెకు ఆహ్వానం, పిలుపు ఉండ‌టం లేద‌న్న చ‌ర్చ పార్టీలో, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చాలాకాలంగా జ‌రుగుతోంది. 

తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి జరిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా కొత్త రేష‌న్‌కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా నుంచి సోమ‌వారం ఆరంభించేందుకు ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంక్షేమ, సివిల్ స‌ప్లై శాఖల‌ మంత్రి గంగుల క‌మాలాక‌ర్ పాల్గొన‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ స్వ‌ర్ణ‌ల‌త పేరుతో మంథ‌ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు, భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తిరాథోడ్‌కు ఆహ్వానం వెళ్లింది. అయితే జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న జ‌క్కు హ‌ర్షిణి పేరును ఇన్విటేష‌న్‌లో  పొందుపరచలేదు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

జక్కు హర్షిణి దళితురాలు కాబట్టే జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌పై రాజ‌కీయ వివ‌క్ష‌, ప్రొటోకాల్ పాటించ‌క‌పోవ‌డం జ‌రుగుతోంద‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి. దళిత బంధుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న రోజే ఈ ఘటన జరగడం మరింత కాక రేపుతోంది. దళితులపై టీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ది ఏంటో ఈ ఘటనతో రుజువు అవుతోందని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ చేసేదంతా ఓట్ల రాజకీయమేనని, ఆయనకు దళితల సంక్షేమంపై చిత్తశుద్ది లేదని చెబుతున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి లాగే.. దళిత బంధు పథకం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే ఉంటుందని అంటున్నారు.