వచ్చే ఏడాది జూన్ కల్లా అందుబాటులోకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు!
posted on Aug 18, 2025 2:06PM

విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని జీఎంఆర్‌కు ఆదేశించడంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయి. గత నెల చివరి నాటికే 84శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.
అంతే కాదు విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ముప్పావుగంటలో చేరుకోవడానికి వీలుగా బీచ్ కారిడాన్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందు కోసం రెండు వేల 800 కోట్ల రూపాయల వెచ్చించేందుకు రెడీ అయిన చంద్రబాబు సర్కార్..విమానాశ్రయానికి అనుబంధంగా 15 అంతర్గత రహదారులను ఫోర్ లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయించింది. ఈ రహదారుల విస్తరణ కోసం 390 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ 15 రహదారుల్లో కనీసం ఏడింటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.అంతే కాకుండా విశాఖలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టనుంది. అన్నీ అనుకున్నట్లే సాగితే, వచ్చే ఏడాది జూన్ నెలలో భోగాపురం విమానాశ్రయంలో విమానరాకపోకలు ఆరంభమౌతాయని అంటున్నారు.