సామాన్యులెరుగని అసమాన్యుడు భారత రత్నసి.ఎన్.ఆర్.రావు
posted on Nov 16, 2013 7:51PM
.jpg)
సామాన్య ప్రజలెవరికీ పెద్దగా పరిచయంలేని సుప్రసిద్ధ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీ. సి.ఎన్.ఆర్.రావు కూడా ఈరోజు సచిన్ తో బాటే భారత రత్నఅవార్డుకి ఎంపికయ్యారు. ఆయన పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. జూన్ 30, 1934న బెంగళూరులో జన్మించారు.
ఆయన డిగ్రీ-మైసూర్ విశ్వవిద్యాలయంలో, మాస్టర్స్ డిగ్రీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, పిహెచ్ డి ఫుర్డ్యూ యూనివర్సిటీలో పూర్తి చేసారు. ఆ తరువాత కాన్పూర్ ఐ.ఐ.టి.లో 13 ఏళ్లు రసాయ శాస్త్ర అధ్యాపకుడిగా చేశారు. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాలలో ఆయన ప్రముఖ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వారు.
ఆయన జీవితం దాదాపుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో బోధన, పరిశోధనలకే అంకితం చేసారు. రసాయన మరియు ఇతర శాస్త్రాలకు చెందిన అంశాలపై ఆయన 45 పుస్తకాలు, దాదాపు 1500 పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. ఆయన అసమాన ప్రతిభను గౌరవిస్తూ వివిధ దేశాలకి చెందిన 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేసాయి.
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన విశిష్టలకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందజేసింది. అవి కాక దేశవిదేశాల నుండి కూడా ఆయన 150కి పైగా ప్రతిష్టాత్మకమయిన అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన ప్రతిష్టాత్మకమయిన ‘శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును’ 1968లోనే స్వంతం చేసుకొన్నగొప్ప వ్యక్తి.
ఆ తరువాత కూడా ఆయన యొక్క ఆ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ వాటన్నిటినీ పేర్కొనాలంటే మరో ప్రత్యేక గ్రంధం వ్రాయవలసి ఉంటుంది. ఇంత వరకు ఆయన అందుకొన్న ప్రతిష్టాత్మకమయిన అవార్డులలో రాయల్ సొసైటీ హ్యూస్ మెడల్ (2000), భారత్ ప్రభుత్వం నుండి ఇండియా సైన్స్ అవార్డు (2004), తెల అవీవ్ విశ్వవిద్యాలయం నుండి డాన్ డేవిడ్ ప్రైజ్ (2005), ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు (2005) కాగా ఇప్పుడు తాజాగా ఆయన కీర్తి కిరీటంలో భారత రత్న వచ్చి చేరింది.
ఈ అసమాన మేధావి డా. సి.ఎన్.ఆర్.రావు ప్రస్తుతం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు. భారత రత్న అవార్డు అందుకొంటున్న సందర్భంగా శ్రీ డా. సి.ఎన్.ఆర్.రావు గారికి తెలుగువన్ తరపున , తెలుగు ప్రజల తరపున అభినందనలు.