నమ్మితే నమ్మండి.. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరార్!
posted on Jun 4, 2025 11:12AM

నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు. నిజానికి మాములు జనమే కాదు.. రాజకీయ వర్గాల్లో చివరకు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ జరిగితే చూద్దాంలే అన్న మాటే వినిపిస్తోంది. అవును మరి, ఒకటి రెండు సార్లు వాయిదా అంటే ఓకే.. కానీ ఒకటికి పది సార్లు అదే రిపీట్ అయితే.. సహజంగానే నాన్న పులి కథ గుర్తుకొస్తుంది. అయినప్పుడు చూద్దాంలే అనే అనుకుంటారు.
అయితే.. ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణ పక్కా అనే మాట ఢిల్లీ వర్గాల నుంచి కొంచెం గట్టిగా వినిపిస్తోందని అంటున్నారు. నిజానికి.. ఇప్పటికే అంతా అయిపోయిందనీ.. కేవలం లాంఛనంగా ప్రకటన విడుదల చేయడం మాత్రమే మిగిలుందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మరి కొందరు ముఖ్యనాయకులు జూన్ 4 న ఢిల్లీ వెళుతున్నారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీతో, ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ కీలక భేటీలో ఖాయంగా మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులతో పాటుగా.. విస్తరణ ముహూర్తం కూడా ఫైనల్ అవుతుందని, అలాగే టీపీసీసీ కూర్పు కూడా ఖరారు కావడం ఖాయమనీ విశ్వసనీయ వర్గాల సమాచారంగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఉహాగానాలు నిజ్జంగా నిజం అవుతాయా లేక, ఎప్పటిలానేనా? అనే అనుమానాన్ని పక్కన పెడితే.. తాజా సమాచరం ప్రకారం ఆశావహుల జాబితాలో ఈ సారి, నిన్న మొన్న ఎమ్మెల్సీ అయిన రాములమ్మ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం పేరు వినిపించడం మాత్రమే కాదు.. ఆల్మోస్ట్ ఖరారైనట్లే అంటున్నారు.
నిజానికి.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్’లో జయశాంతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసినప్పుడే ఆశావహుల జాబితాలో ఆమె పేరు చేరింది. మీనాక్షి నటరాజన్ ను కలిసిన సందర్భంలో విజయశాంతి తన మనసులోని కోరికను బయట పెట్టినట్లు తెలిసింది. ఆ సందర్భంగా మీనాక్షి నటరాజన్ అది అధిష్టానం పరిధిలోని అంశం అంటూనే.. విషయాన్ని అధిష్టానం చెవిన వేస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ.. ఇప్పుడు ఫైనల్ లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది.
అదలా ఉంటే.. మంత్రి వర్గంలోకి కొత్తగా ఐదుగురిని తీసుకోవడంతో పాటుగా, మంత్రుల శాఖల్లో కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతల శాఖల్లోనే మర్పులుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇద్దరు మంత్రుకు ఉద్వాసన తధ్యమనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే.. కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే చివరాఖరుకు ఏమి జరుగుతుందనేది ఇప్పటికీ సస్పెన్సే.. అంటున్నారు.