బ్యాంకు ఖాతాలను దోచేస్తున్న కొత్త వైరస్

లండన్: మీ ఖాతా నుంచి తరచుగా ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్నారా? అయితే పాస్‌వర్డ్, ఇతర వివరాలను దొంగిలించే కొత్త వైరస్ వచ్చింది జాగ్రత్త! అదే ట్రోజన్ హార్స్ వైరస్ కొత్త వెర్షన్ 'స్పై ఐ'. ఖాతా వ్యవహారాలను ఆన్‌లైన్‌లో చూసుకునేప్పుడు సంబంధిత వివరాలను ఈ వైరస్ సేకరిస్తుంది.దాంతో సైబర్ నేరగాళ్లు అకౌంట్‌లోని సొమ్మునంతా మాయం చేస్తారు. అయితే ఈ మోసాన్ని కనిపించకుండా చేయడమే ఈ వైరస్ ప్రత్యేకత. నకిలీ స్క్రీన్‌ను సృష్టించి మన ఖాతాలో డబ్బు ఉన్నట్లే చూపిస్తుంది. బాధితుడు గుర్తించే వరకు దీన్ని కొనసాగించి ఖాతాలోకి వచ్చే నగదును ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్లు దోచేసుకుంటారు.ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగిస్తున్న కంప్యూటర్లపైనే  'స్పైఐ' వైరస్ దాడి చేస్తోంది. ట్రస్టీర్ అనే భద్రతా సంస్థ దీన్ని గుర్తించింది. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ.. యాంటీ ఫిషింగ్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలని జాగ్రత్తలు సూచించింది.