బీజేపీలో ఫుల్ జోష్.. బండి సంజయ్ విక్టరీ మెసేజ్..
posted on Nov 2, 2021 12:23PM
చెప్పానా.. నే చెప్పానా.. హుజురాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని నే చెప్పానా.. ఇప్పుడదే జరుగుతోంది.. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురుతోంది.. ఈటల రాజేందర్‌దే విజయం.. అసెంబ్లీలో బీజేపీకి మరో స్థానం.. ఇలా విజయ నినాదం ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.
హుజురాబాద్ గెలుపు సిగ్నల్‌తో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ధూంధాం డ్యాన్సులతో అప్పుడే విక్టరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ సందర్భంగా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.
తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదని బండి సంజయ్ అన్నారు. దళిత బంధు అమలు చేసినా ప్రజలు టీఆర్ఎస్‌ను నమ్మడం లేదని బండి సంజయ్ తేల్చేశారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడని.. ఆయన గెలుపు బీజేపీ గెలుపు.. బీజేపీ గెలుపు ఈటల గెలుపే అని అన్నారు. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్‌తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ హ్యాట్సాఫ్ తెలిపారు.