నేడు హస్తినకు తెలుగుదేశం అధినేత.. మోడీ షాలతో భేటీ

తెలుగురాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆ రెండు పార్టీల నుంచీ పెద్ద సంఖ్యలో నాయకులు బయటకు వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ వేగంగా జరుగుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ. అదే సమయంలో ఏపీలో కూడా రాజకీయాలు వేగంగా మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి హస్తిన పర్యటన నేపథ్యంలో ఈ ఊహాగానాల జోరు పెరిగింది. ఇప్పటి వరకూ ఏపీలో తెలుగుదేశంన, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే  బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. బీజేపీని కూడా కలుపుకుని పోతామని పదే పదే చెబుతున్నా కమల నాథుల తీరు  చూస్తే.. అది సాధ్యమయ్యేలా లేదనే రాజకీయ వర్గాలు భావించాయి.  బహిరంగంగా పొత్తు ప్రకటన లేకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ పార్టీకే బీజేపీ వత్తాసు పలుకుతోందన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది.  ఎన్నికల వేళ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో  పదివేలక కోట్ల రూపాయలకు పైగారెవెన్యూ లోటు నిధులను గంపగుత్తగా ఒకే సారి విడుదల చేయడంతో కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా జగన్ కు అండగా నిలవాలని నిర్ణయానికి వచ్చేసిందన్న అభిప్రాయమే సర్వత్రా నెలకొంది. అలాంటి వేళ.. హఠాత్తుగా చంద్రబాబు హస్తిన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. శనివారం (జూన్ 3) సాయంత్రం ఆయన హస్తిన బయలదేరనున్నారు.

ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అలాగే  ప్రధాని మోడీతో  కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అమిత్ షాతో శనివారం ( జూన్ 3) రాత్రి భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు ఆదివారం (జూన్ 4) భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకమౌతున్న నేపథ్యంలో.. ఏపీలో మునిగిపోయే నావలా ఉన్న వైసీపీతో కలిసి వెళ్లడం కంటే.. తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడమే మేలని కమలనాథులు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేనిది చంద్రబాబుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా బాబు హస్తిన పర్యటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.