విజయసాయిరెడ్డి ఆంతర్యం ఏమిటి?
posted on May 2, 2012 9:28AM
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన ఆడిటర్ విజయసాయిరెడ్డి త్వరలో తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానని ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. వై.ఎస్. కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి సిబీఐపైనే పోరాటం సాగించాడు. ఆ విచారణ సంస్థను ధిక్కరిస్తూ మాట్లాడాడు. కానీ, ఇటీవల విడుదలైన ఆయన సిబీఐ విచారణ చట్టబద్ధంగా కొనసాగుతోందని కితాబు ఇవ్వటం విశేషం. ఈ కితాబు వెనుక ఏమి జరిగి ఉంటుందీ? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కారణాలు ఏవైనా జగన్ కేసులో సిబీఐ దర్యాప్తు ఇటీవల మందగించింది. దీనికి తోడు కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ, జగన్ కు మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ఈ కేసు నిర్వీర్యం అవుతుందనే భావనతోనే విజయసాయిరెడ్డి త్వరలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు. సిబీఐ దర్యాప్తు సజావుగా సాగితే జగన్ ను ఈపాటికే అరెస్టు చేసి ఉండేవారు. విజయసాయిరెడ్డికి బెయిల్ కూడా లభించి ఉండేది కాదు. ఈ విషయం విజయసాయిరెడ్డికి కూడా బాగా తెలుసు. సిబీఐపై జగన్ వర్గం పైచేయి సాధించి ఉంటుందని అందుకే తాను మళ్ళీ జైలుకు వెళ్ళవలసిన అవసరం ఉండదని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ధీమాతోనే ఆయన తాను రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని ప్రకటించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.