దస్తగిరి భార్యపై దాడి!
posted on Mar 17, 2025 10:57AM
.webp)
వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇటీవల తన ప్రాణాలకు ముప్పు ఉంది, భద్రత కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే. దస్తగిరి ప్రాణాలకు ముప్పు మాట నిజమేననడానికి తాజాగా ఆయన భార్య షబానాపై జరిగిన దాడి రుజువుగా నిలిచింది. షబానాపై ఆమె నివాసంలోనే దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారు వైసీపీ మహిళా కార్యకర్తలని ఆమె ఆరోపించారు. తన ఇంట్లోకి జొరబడిన వైసీపీ మహిళా కార్యకర్తలు తనను అసభ్య పదజాలంతో దూషించారనీ, ఈ ఏడాది చివరిలోగా దస్తగిరిని ఖతం చేస్తామని హెచ్చరించారనీ షబానా పేర్కొన్నారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు రక్షణ కల్పించలేదనీ, అలాగే తన ఫిర్యాదు కూడా నమోదు చేసుకోలేదని షబానా ఆరోపించారు.
వివేకా హత్య కేసులో సాక్షులంతా అనుమానాస్పద స్థితిలో వరుసగా మరణిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఈ కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా దస్తగిరి భార్యపై దాడి సంఘటనపై స్పందించిన మాల్యాల పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు.