బాపట్ల జిల్లాలో దారుణం...నడిరోడ్డుపై భర్తకు ఉరేసి చంపేసిన అర్ధాంగి
posted on Jan 2, 2025 5:48PM
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండనే ఉండవు. భర్త నేరం చేస్తే భార్య కేసులు నమోదు చేయడం సహజం. కానీ బాపట్ల జిల్లాలో ఓ భార్య భర్తపై కేసు పెట్టలేదు . కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లిందేమో భర్తకు ఏకంగా మరణ శిక్ష విధించింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఉరేసింది. ఒక తాడును మెడలో వేసి రోడ్డుపై ఈడ్చుకురావడంతో ఆ భర్త గిలా గిలా కొట్టుకుంటూ ప్రాణలొదిలాడు. మరణ శిక్ష విధిస్తే చివరి కోరిక ఏమిటో చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ భార్య తన భర్తకు చివరి చాన్స్ కూడా ఇవ్వలేదు. మద్యానికి బానిస అయిన అమరేంద్రబాబు ను ఉరివేసి చంపేసింది.
వివరాల్లోకి వెళితే ఆంద్రప్రదేశ్ బాపట్ల జిల్లా కొత్తపాలెం చెందిన అరుణతో గోకర్ణ మఠానికి చెందిన అమరేంద్రబాబుకు పన్నేండేళ్ల క్రితం సాంప్రదాయబద్దంగా వివాహమైంది. హైదరాబాద్ లో హోంగార్డు ఉద్యోగం చేసే అమరేంద్రబాబు నాలుగైదు సంవత్సరాల నుంచి మద్యానికి బానిసయ్యాడు. తరచూ తాగి భార్యను కొట్టేవాడు. ఇది భరించలేక అరుణ పుట్టింటికి వెళ్లిపోయింది. న్యూ ఇయర్ లో భార్యతో కలిసి ఉందామని డిసైడయ్యోడేమో అత్తారింటికి వెళ్లి భార్యను రమ్మన్నాడు. అల్లుడు ప్రవర్తనకు విసిగిపోయిన అత్తింటివారు దాడి చేయడంతో అమరేంద్రబాబు స్పృహ కోల్పోయాడు. అప్పటికే భర్త ను చంపాలని నిర్ణయించుకున్న అరుణ భర్త మెడలో ఓ తాడు వేసి గట్టిగా గుంజేసింది. ఊపిరాడని స్థితిలో ఉన్న భర్తను రోడ్డు మీదకు ఈడ్చుకురావడంతో ఊపిరాడక చనిపోయాడు . క్షణికావేశంలో భర్తకు మరణదండన విధించిన ఈ ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఏడడుగుల బంధానికి మాయని మచ్చగా మారింది.