ఆమాద్మీ రోడ్డున పడ్డాడు

 

అపూర్వమయిన మెజార్టీతో డిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమాద్మీ పార్టీకి ఇక ఎదురే ఉండబోదని అందరూ భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పార్టీలో కూడా అప్పుడే తిరుగుబాట్లు, అసమ్మతి స్వరాలు, గ్రూప్ రాజకీయాలు అన్నీ మొదలయిపోయాయి. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా గడవక ముందే పార్టీ మళ్ళీ రోడ్డున పడింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలను పార్టీలో సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై నిరసించడంతో వారిని కీలకమయిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తన కన్వీనర్ పదవికి రాజీనామా అస్త్రం ప్రయోగించవలసి వచ్చింది. తక్షణమే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యి ఆ ఇరువురు సభ్యులను తప్పించేరు. కానీ ఆ సమావేశానికి హాజరయిన మొత్తం 19 మంది సభ్యులలో 11 మంది మాత్రమే వారి ఉద్వాసనకు మద్దతు పలుకగా మిగిలిన 8మంది వ్యతిరేకించారు. అంటే వారు కూడా అరవింద్ కేజ్రీవాల్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత కలిగి ఉన్నారని స్పష్టం అవుతోంది. మెజార్టీ నిర్ణయం ప్రకారం యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లను రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పించగలిగారు, కానీ చేజేతులా మరో 8 మంది సీనియర్ నేతలను శత్రువులుగా తయారుచేసుకొన్నట్లయింది.

 

వారిలో ఒకరయిన మయాంక్‌ గాంధీ మీడియా ముందుకు వచ్చి జాతీయ కార్యవర్గ నిర్ణయాన్ని తప్పుపట్టారు. యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ ఇరువురూ స్వచ్చందంగా రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పుకొనేందుకు అంగీకరించినప్పుడు వారిని ఇంత అవమానకరంగా బయటకు సాగనంపవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు తనను కూడా ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని తన పార్టీ నేతలు ఆదేశించారని, కానీ తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరును గట్టిగా విమర్శించారు. అంటే నేడో రేపో ఆయనకీ ఉద్వాసన పలికే సమయం ఆసన్నమయిందని స్పష్టం అవుతోంది.

 

అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించినందుకు ఇద్దరు సభ్యులను బయటకు పంపినందుకు పార్టీలో అసంతృప్తి మొదలయింది. మరి కొందరు ఇప్పుడు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో ఓడిపోయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇదే అదునుగా అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరిటువంటి సమయంలో ఆయనను విమర్శిన్న కారణంగా మయాంక్ గాంధీపై కూడా వేటువేసినట్లయితే మరిన్ని విమర్శలు, పార్టీలో అంతర్గతంగా మరిన్ని సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షించినా ప్రమాదమే. కనుక ఏదోవిధంగా పార్టీలో ఈ పరిస్థితులను చక్క దిద్దవలసి ఉంటుంది.

 

తమ పార్టీ మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే విభిన్నమయింది. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. పదవులు, అధికారం, రాజకీయాల కంటే ప్రజలకు సేవ చేయడానికే తామంతా అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొన్న ఆమాద్మీ పార్టీ, దాని నేతలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఏమాత్రం భిన్నమయినవారు కారని నిరూపిస్తున్నారు. ఇదివరకు అధికారంలోకి వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాల కారణంగానో లేక సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా దేశాన్నే ఏలేయాలనే దురాశాతోనో అధికారం వదులుకొన్నారు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ చాలా సార్లు ప్రజల ముందు లెంపలు వేసుకొన్నారు కూడా. ప్రజలు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి కూడా మళ్ళీ పార్టీని చక్కదిద్దుకోలేక చతికిలపడినట్లయితే ఆయన ప్రభుత్వానికే ప్రమాదం.

 

డిల్లీ ప్రజలు కోటి ఆశలతో ఆమాద్మీని అఖండ మెజార్టీతో గెలిపించుకొంటే ఆ పార్టీ నేతలు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల ఆశలు నెరవేర్చే ప్రయత్నాలు చేసే బదులు వారిలో వారే కుమ్ములాడుకోవడం చాలా దురదృష్టకరం. వారు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోలేకపోతే ప్రజలు వారికి మళ్ళీ మరో అవకాశం ఇవ్వరని గ్రహిస్తే మంచిది.